తెలంగాణలో మళ్లీ పదేళ్లు పొడిగింపు!
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మళ్లీ 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. గరిష్ట వయోపరిమితి పొడిగింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వయస్సు మీరిన నిరుద్యోగ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో జనరల్, ఇతర కేటగిరీల నిరుద్యోగుల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మరో రెండు నెలల్లో ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలోగా గరిష్ట వయోపరిమితి పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వంటి శారీరక దృఢత్వం అవసరమైన పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ శాఖల్లోని పోస్టుల మినహా అన్ని శాఖల్లోని ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి పొడిగింపును ప్రభుత్వం మళ్లీ వర్తింపజేయనుంది. టీఎస్‌పీఎస్సీతో సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఈ పొడిగింపు వర్తించనుంది.
గడువు ముగిసి రెండేళ్లు…
ప్రత్యక్ష నియామకాల విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు తాత్కాలికంగా ఏడాది కాలం పాటు పొడిగిస్తూ 2015, జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడుగా గరిష్ట వయోపరిమితిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తున్న ప్రత్యేక సడలింపులు యథాతథంగా అమలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదనంతర కాలంలో ఈ ఉత్తర్వుల అమలు గడువును మరో రెండు పర్యాయాలు ప్రభుత్వం పొడిగించింది. చివరిసారిగా 2019, జూలై 26తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోగా, మళ్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అప్పట్లో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి గరిష్ట వయోపరిమితి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది.
గడువు తీరిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక సడలింపులు..
లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ ఏడాది మేతో ముగిసింది. మళ్లీ ప్రభుత్వం గడువు పొడిగించలేదు. త్వరలో మరో ఐదేళ్ల కాలానికి ఈ మేరకు ప్రత్యేక సడలింపులు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి.