‘సినిమా వాళ్ల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీశ్’
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాలి గాయం, చికిత్సపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకులు వీల్ చైర్లో, స్ట్రెక్చర్లపై వస్తున్నారంటూ దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. అసలు డ్రామాలకే పర్యాయపదం కేసీఆర్ కుటుంబమని, సినీనటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీశ్‌రావులని దుయ్యబట్టారు.
మంగళవారం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సందర్భంగా తన వెంట పెట్రోల్ తెచ్చుకున్న హరీశ్ 50 పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఆనాటి ఫొటోలను మీడియాకు ప్రదర్శించారు. తన ఆత్మబలిదానంతో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హరాలు కాదా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి కేసీఆర్ ఇప్పించారా? లేదా? అనేది కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఈటలపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్ క్షమాపణలు చెప్పాలని రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.