అప్కాన్స్ బృందం పనితీరు అద్భుతం స్మార్ట్ సిటీ ఎం.డి. గిరీషా
చిత్తూరు జిల్లా: తిరుపతి,నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణ సంస్థ అప్కాన్స్ బృందం పనితీరు అద్భుతంగా ఉందని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా అన్నారు. లీలా మహల్ కూడలి వద్ద గ్రౌండ్ లెవల్ నుండి 71.5 అడుగుల ఎత్తులో సెకండ్ లెవల్ ఫ్లైఓవర్ యొక్క మూడు స్టీల్ బాక్స్ గిర్డర్ల నిర్మాణాన్ని ఎస్. ఆర్. సామి నేతృత్వంలోని అప్కాన్స్ గరుడ వారధి బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ బృందాన్ని శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అభినందించి సర్టిఫికెట్ ను అందజేశారు.
స్మార్ట్ సిటీ ఎం.డి. గిరీషా మాట్లాడుతూ గ్రౌండ్ లెవల్ నుండి 71.5 అడుగుల ఎత్తులో సెకండ్ లెవల్ ఫ్లైఓవర్ యొక్క మూడు స్టీల్ బాక్స్ గిర్డర్ల ను ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ప్రాజెక్ట్ లోని ఈ భాగం గరిష్టంగా 50 మీటర్ల రేడియస్ వక్రతను కలిగి ఉంటుందన్నారు. ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదన్నారు. ఇటువంటి క్లిష్టమైన నిర్మాణానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో మరియు అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుని ఏర్పాటు చేశారన్నారు. ఈ తరహా ఇంజినీరింగ్ నిర్మాణం చేపట్టడం తిరుపతిలో ఇదే మొదటిదన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాత్రి వేళల్లో మొత్తం చేయడం సంతోషకారమన్నారు. ఇలాంటి క్లిష్టతరమైన పనిని విజయవంతగా పూర్తి చేసిన ఎస్.ఆర్. సామి నేతృత్వంలోని అప్కాన్స్ బృందానికి “సర్టిఫికేట్ ఆఫ్ అప్రెసియేషన్” ను అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏఈ కామ్ ప్రతినిధి బాలాజీ, ఆఫ్కాన్స్ ప్రతినిధి స్వామి, తదితరులు ఉన్నారు.