టోక్యో లో చరిత్ర :నీరజ్ చోప్రాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ( Olympics ) జావెలిన్ త్రో ఈవెంట్లో అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు టోక్యోలో చరిత్ర లిఖించబడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ నీరజ్ చోప్రా సాధించిన ఘనత దేశ ప్రజల మనసుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిందని కొనియాడారు. ఫైనల్లో నీరజ్ ప్రదర్శన ఆమోఘని ప్రధాని మెచ్చుకున్నారు.
ఇవాళ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతోపాటు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించాడని పొగిడారు. టోక్యోలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన నీరజ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలియజేశారు.జావెలిన్ గోల్డ్‌తో నీరజ్ చరిత్ర సృష్టించాడని కొనియాడారు. నువు సాధించిన ఘనత దేశయువతకు ప్రేరణగా నిలుస్తుందని నీరజ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.