తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించాలి  : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

 శ్రీ‌వారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజ‌మైన భ‌గ‌వ‌త్‌ సేవ అని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి చెప్పారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉద‌యం 75వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అద‌న‌పు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ  క‌రోనా సెకండ్ వేవ్‌లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ భ‌క్తులకు  శ్రీ‌వారి ద‌ర్శ‌నాన్ని క‌ల్పించామ‌న్నారు.

ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా   పండించిన  బియ్యం, ప‌ప్పు దినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల  నైవేద్యం అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఆగస్టు 30వ తేదీ శ్రీకృష్ణజన్మాష్టమి ప‌ర్వ‌దినం నుండి న‌వ‌నీత సేవను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం గుజ‌రాత్ నుండి 25 గిర్‌జాతి గోవులు తెప్పించామన్నారు. వాటి పాల నుండి నెయ్యి త‌యారు చేసి స్వామివారి కైంక‌ర్యాల‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు వివ‌రించారు.  

భ‌క్తులకు వ‌స‌తి గ‌దులు కేటాయించ‌డంలో ఆల‌స్యాన్ని నివారించేందుకు ఆరు ప్రాంతాల్లో  రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేసామన్నారు. పేర్లు న‌మోదు చేసుకున్న భ‌క్తుల మొబైల్ ఫోన్‌కు ఉప విచార‌ణ కేంద్రాల్లో వారికి కేటాయించిన గ‌దుల వివ‌రాల‌తో  ఎస్ఎంఎస్ వెళుతుంద‌న్నారు. ఆన్‌లైన్‌లో గ‌దులు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత గ‌దుల స్లిప్పుల‌ను అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీ‌వారిమెట్టు న‌డ‌క‌మార్గాల్లో స్కాన్ చేసుకుంటే తిరుమలకు చేరుకోవడానికి ముందే వారికి కేటాయించిన గ‌దుల వివ‌రాలు ఎస్ఎంఎస్ వ‌స్తుంద‌న్నారు. ఈ  నూత‌న విధానంపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.

తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి స‌మూదాయాలు, అతిథి గృహాల‌ను అధునీక‌రిస్తున్నామ‌ని, డిసెంబర్ నాటికి ఇందులో గీజ‌ర్లు, ఇత‌ర స‌దుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలిపారు.  అలిపిరి న‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ ప‌నులు సెప్టెంబ‌ర్ నెల చివ‌రి నాటికి పూర్తి చేసి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు చెప్పారు. తిరుమ‌ల‌లోని అన్న ప్ర‌సాద కేంద్రంలో సాంప్ర‌దాయ భోజ‌నం పేరుతో నూత‌న స్కీమ్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇందులో గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన సరుకులతో ప‌దార్థాల‌తో త‌యారు చేసి, భ‌క్తుల‌కు అందుబాటు ధ‌ర‌లో ఉంచ‌నున్న‌ట్లు చెప్పారు.  ఎస్వీబీసీ ద్వారా భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేస్తున్నామన్నారు.  షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌, యుద్ద కాండ‌, స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం, బాల‌కాండ‌, ఆదిప‌ర్వం,  శ్రీ భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ప్ర‌పంచంలోని మాన‌వులు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని న‌క్ష‌త్రస‌త్ర మ‌హాయాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం ఆకాశ‌గంగ అని పండితులు నిర్ధారించాక, హ‌నుమ‌త్ జ‌యంతి సంద‌ర్భంగా ఆకాశగంగ వద్ద మొద‌టి సారిగా 5 రోజుల పాటు ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు తెలియ‌జేశారు.  

టిటిడి ఉద్యోగుల సౌక‌ర్య‌ర్థం తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రిని మొద‌టిసారిగా కోవిడ్ ఆసుప‌త్రిగా మార్చి ఆత్యాధునిక వైద్య స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో టిటిడిలోని అన్ని విభాగాల‌ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా ప‌నిచేశార‌ని, తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు విశేష‌ సేవ‌లు అందిస్తున్నార‌ని అద‌న‌పు ఈవో ప్ర‌శంసించారు.  

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, శ్రీ సెల్వం, ఇన్‌చార్జ్ ఆరోగ్యశాఖాధికారి డా. సునీల్‌, ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారధి, విజివో శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ జీఎల్ఎన్ శాస్త్రీ  ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author