క్షణికావేశం.. తీసింది ముగ్గురి ప్రాణం


క్షణికావేశం.. ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఓ తల్లి తన కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన హృదయ విదారక ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మిలటరీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మానస (27), బండారు శ్రావణ్‌కుమార్‌కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల మానస తిరుపతి పుణ్యక్షేత్రం వెళ్లాలని కోరడంతో కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు. అయితే మానస భర్త శ్రావణ్‌కుమార్‌ పని వత్తిడి వల్ల తిరుపతికి రాలేనని అత్తమామలతో కలసి పిల్లలను తీసుకెళ్లాలని సూచించాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అయితే రోజు మాదిరిగానే శనివారం రాత్రి శ్రావణ్‌ కుమార్‌ ఇంటి పైపోర్షన్‌లో పడుకున్నాడు. కింద పోర్షన్‌లో మానస, పిల్లలిద్దరూ పడుకున్నారు.అయితే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రావణ్‌కుమార్‌ నిద్రలేచి కిందకు వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో, భార్యకు ఫోన్‌ చేశాడు. ఎంతకీ ఫోన్‌ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు షర్మిల (3), జ్యోతి (2), మానస విగత జీవులయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్‌ఐ సమీర్‌ బాషా వివరాలను సేకరించారు. ఇద్దరు చిన్నారుల మెడకు కాటన్‌ క్లాత్‌ గట్టిగా బిగించి దివాన్‌కాట్‌కు కట్టేసి చంపేసిన అనంతరం మానస కూడా ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మానస తండ్రి గుంజా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ సమీర్‌ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తెకు కోపం ఎక్కువని, గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ తెలిపారు. ఈ కోణంలోనే మానస క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కూడా ఫిర్యాదులో మృతురాలి తండ్రి పేర్కొన్నారని ఎస్‌ఐ వివరించారు.

About The Author