లవ్ స్టోరీ సినిమా రివ్యూ
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎంతో మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ విడుదలైన చిత్రం “లవ్ స్టోరీ”. ‘సారంగదరియా’ పాట, సాయి పల్లవి క్రేజ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కెరీర్ లో హిట్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం మరొక సానుకూలమైన అంశం. వీటికి తోడు ఓవరాల్ గా పాటలన్నీ హిట్ అవ్వడం, అడ్వాన్స్ బుకింగ్స్ తో వారం ముందుగానే ఓపెనింగ్స్ బాగా నమోదు చేసుకోవడం హైప్ ని పెంచాయి. ఇన్ని అంచనాల మధ్యలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కులాంతర-మతాంతర ప్రేమ కథని చెప్పాలనుకుని దిగారు. దాంట్లో మరొక సామాజిక అంశం కూడా అంతర్లీనంగా జోడించారు. తెలంగాణా ప్రాంతాన్ని నేపథ్యంగా సెట్ చేసుకున్నారు.
వినగానే ఇలాంటి కథలు ఈ మధ్యన చాలానే చూసేశామనిపించొచ్చు. కొత్తదనమేముందని అడగొచ్చు.
“ఈ రోజుల్లో ఆ స్థాయి కుల వివక్ష ఎక్కడుంది?” అని ప్రశ్నించే వాళ్లు కూడా ఉండొచ్చు.
అలాంటి వారికి కళ్లు తెరిపించిన వార్తలు ఎన్నో ఉన్నాయి. పరువుహత్యలు, కులం పేరుతో చేసే అవమానాలు అనేకం సమకాలీన సమాజంలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్ని సినిమాల్లో ఈ సమస్యని అడ్రస్ చేసినా తనదైన శైలిలో శేఖర్ కమ్ముల చెప్పిన తీరు మనసుని హత్తుకుంటుంది.
ఒక సన్నివేశంలో మౌనిక కులం పాయింట్ తో నోరుజారి రేవంత్ మనసుని గాయపరుస్తుంది. ఆ సన్నివేశంలో పండిన డ్రామా రక్తికట్టింది. ఆ సీన్ పతాక స్థాయికి చేరుకోగానే రేవంత్ కంటి నుంచి కారిన నీరు ప్రేక్షకుల కళ్లల్లోంచి కూడా కారుతుంది. కరుణ రసం పండడం అంటే అదే.
అలాగే చెప్పుకోవడానికి ఇబ్బంది పడే మరొక చికాకైన సామాజిక అంశాన్ని ఇందులో చెప్పిన తీరు దర్శకుడి మెచ్యూరిటీని సూచిస్తుంది. ఏ మాత్రం కాస్త అటూ ఇటు అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉండే అంశాన్ని కత్తి అంచు మీద నడిపించాడు దర్శకుడు. సస్పెన్స్ రివీల్ చేయడం సమంజసం కాదు కనుక ఇక్కడ ఇంతకన్నా చెప్పట్లేదు. ఈ రెండో అంశాన్ని చివరిదాకా రివీల్ చెయ్యారు. కానీ “ఏదో ఉంది” అనే ఫీలింగ్ మాత్రం చూస్తున్నంతసేపూ కలుగుతూనే ఉంటుంది.
ఇబ్బందైనా ఇలాంటివి ఈ కాలం పిల్లలు కూడా తెలుసుకోవాలసిన అవసరం ఉంది. వావి వరసలు సమాజంలో ఉన్నా కొంతమంది మగాళ్ల బుర్రల్లో అవి ఉండవన్న సత్యం కూడా తెలియజెప్పాల్సిన రీతిలో తెలియజెప్పాలి. ఇది చెబితే ఇండైరెక్ట్ గా ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పినట్టే. మగవాళ్ల బుద్ధికి కూడా వార్ణింగ్ ఇచ్చినట్టే. ఆ ప్రయత్నమే ఇక్కడ శేఖర్ కమ్ముల చేసారు.
ఇక మేకింగ్ పరంగా చెప్పుకోదగ్గ పెద్ద విషయం ఏంటంటే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి క్యాస్టింగ్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా ఈయన సినిమాల్లో కాస్త నిడివి ఉన్న పాత్రలకి కూడా తెలిసిన వాళ్లనో, చుట్టాలనో, స్నేహితులనో పెట్టేసుకుంటారని ఒక కంప్లైంట్. వాళ్లకి నటన రాక, ఆడియన్స్ ఎమోషన్ కి కనెక్ట్ కాక ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఈ సారి అటువంటి డ్రాప్స్ ఏవీ లేవు. అందరూ సీజండ్ నటీనటులు కనిపించారు.
సాయి పల్లవి ఈ సినిమాకి హై లైట్ గా నిలిచింది. కథని చివరి వరకు తన అభినయంతో మోసేసింది. ప్రతిభావంతుడైన దర్శకుడికి తగిన ప్రతిభావంతురాలైన నటి అని మరొక సారి అనిపించుకుంది.
నాగ చైతన్య నటన కూడా ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంది. ఎక్కడా రొటీన్ హీరో మాదిరిగా కాక పాత్రగా కనిపించాడు. పూర్తిగా న్యాయం చేసాడు.
రేవంత్ తల్లిగా ఈశ్వరీ రావు, మౌనిక తల్లిగా దేవయాని ముఖ్యమైన సన్నివేశాల్లో మెప్పించారు. మొదటి సగంలో కనిపించిన గంగవ్వ కాసేపు నవ్వించింది. విలన్ గా రాజీవ్ కనకాల, సబ్-ఇన్స్పెక్టర్ గా ఉత్తేజ్ పాత్రలకి న్యాయం చేసారు.
ఈ సినిమాకి కనిపించని మరొక ప్రధాన హీరో నూతన సంగీత దర్శకుడు పవన్. ఒక్క పాట కూడా వంక పెట్టేలా లేదు.
“సారంగ దరియా” పాట ఆఖరి పాటగా రావడం పర్ఫెక్ట్ ప్లేస్మెంట్.
“నీ చిత్రం చూసి..” సెకండ్ బెస్ట్ సాంగ్ అనిపిస్తుంది.
అలాగే “తర రంపం” పాటలో సాయి పల్లవి నాట్యవిశ్వరూపం చూడొచ్చు.
బ్యాక్ గ్రౌండ్ కూడా చక్కగా ఉంది. ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా కాపడడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడ్పడింది. కెమెరా వర్క్ ఒక పొయెట్రీలాగ ఉంది. ఎడిటింగ్ కత్తెర పదును కూడా బాగానే ఉంది.
ఇక మైనస్ పాయింట్ చెప్పుకోవాలంటే..అప్పటి వరకు కథని హత్తుకునేలా చెబుతూ సడెన్ గా టైమైపోతోందని క్లైమాక్స్ ని త్వరగా ముగించినట్టు అనిపించింది. ముగించినా పర్వాలేదు. కానీ ముక్తాయింపు విజువల్ గా కాకుండా ఫేడౌట్ అవుతున్న జడ్జ్ గారి వాయిస్సులో చెప్పడం వల్ల ఏదో అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చెప్పేదేదో “ఆర్నెల్ల తర్వాత” అని సన్నివేశంగా చూపిస్తే ఒక క్లారిటీ ఉండేది.
పాటలు బాగుండడంతో, సాయి పల్లవి హీరోయిన్ అవ్వడంతో, శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో ఈ సినిమాని చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ రెడీ అవ్వొచ్చు. అయితే ఇది బరువైన చిత్రం. రొటీన్ కామెడీలు, సినిమాటిక్ టచ్ లు ఉండవు. సీరియస్ సబ్జెక్టుని మంచి సంగీతంతో ప్యాక్ చేసిన సినిమా ఇది. వెతుక్కుంటే సామాజిక సందేశం కూడా ఉంది ఇందులో. ఆ టేస్ట్ ఉన్నవాళ్లు చూడొచ్చు.
సినిమా : లవ్ స్టోరీ
రేటింగ్: 3/5
నటీనటులు: సాయి పల్లవి, నాగ చైతన్య, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, ఈశ్వరి రావు, ఆనంద చక్రపాణి, దేవయాని, గంగవ్వ తదితరులు
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరా: విజయ్ సి కుమార్
సంగీతం: పవన్ సీ.హెచ్
నిర్మాత: నారాయణ్ దాస్ కె. నారంగ్, రామ మోహన్ రావ్
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల తేదీ: 24 సెప్టెంబర్ 2021