ఎన్నికల్లో తెదేపా, జనసేన కలసి పోటీ చేసే అవకాశాలు …?
ఎన్నికల్లో తెదేపా, జనసేన కలసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయగా… జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద బుధవారం టీజీ వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో భాజపాని ఓడించే లక్ష్యంతో మాయావతి, అఖిలేష్‌యాదవ్ కలసినప్పుడు.. ఏపీలోనూ చంద్రబాబు, పవన్ కలిసే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని.. పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రకటనలతో కేడర్‌ను, ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ఆదేశించారు. నాయకులు సంయమనం కోల్పోవద్దని, ఎన్నికల సమయంలో ఇలాంటి గందరగోళం సృష్టించడం ఎవరికీ మంచిది కాదని స్పష్టం చేశారు.
టీజీ వెంకటేష్‌పై పవన్ ధ్వజం
‘కౌన్సిలర్ పదవిని కూడా ఆశించకుండా మీకు ఆనాడు మద్దతునిస్తే ఈ రోజు తమపై ఎన్నికల ఆట మొదలుపెడుతున్నారు…’ అని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ బుధవారం విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మేం వదిలేసిన, వద్దనుకున్న రాజ్యసభ సీటుతో ఎంపీ అయిన నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు. తెలిసీ తెలియకుండా మాట్లాడకు. పెద్దమనిషివని మర్యాదనిచ్చాను. అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తినని గుర్తుంచుకో. పెద్దరికాన్ని నిలబెట్టుకో. ఇష్టానికి మాట్లాడకు…’ అని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల నుంచి నాయకులను తయారు చేయాలనే ఇన్నాళ్లు పోటీకి దూరంగా ఉన్నామని చెప్పారు. ఆఖరిశ్వాస వరకు మీతో కలిసే ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రత్యేకంగా విభేదాలేమీ లేవు..
తెదేపాతో జనసేనకు ప్రత్యేకంగా విభేదాలేమీ లేవని, కేంద్రంపై తెదేపా గట్టిగా పోరాడితే, రాష్ట్రానికి రావాల్సినవన్నీ వచ్చేవన్నదే పవన్‌కల్యాణ్ అభిప్రాయమని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెదేపా కేంద్రంతో పోరాడుతున్నందున… ఇక తెదేపా, జనసేన కలవడానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చని చెప్పారు. ‘తెదేపా, జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కార్యకర్తలుగా మేం నిర్ణయించలేం. రెండు పార్టీల కేడర్‌లోనూ ప్రస్తుతం ఒక సదభిప్రాయంతో కూడిన వాతావరణం ఉంది. అభిప్రాయాలు కలిస్తే రెండు పార్టీలు కలసి పోటీ చేయవచ్చు…’’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు టీజీ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించడంతో… సాయంత్రం మళ్లీ విలేకరులతో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు. ‘నేను పవన్‌ని అగౌరవపరిచేలా మాట్లాడలేదు. మేం తెదేపా కార్యకర్తలం మాత్రమేనని, పొత్తు ఉంటుందో లేదో నిర్ణయించాల్సింది రెండు పార్టీల అధినేతలేనని చెప్పాను. పొత్తు ఉండాలని వారు నిర్ణయించుకుంటే, సీట్ల సర్దుబాటుపై మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని మాత్రమే అన్నాను. ఒక నాయకుడిగా పవన్ ఆవేశంతో మాట్లాడడం తగదు. పూర్తి సమాచారం తెలుసుకోవాలి. నేను అన్నది అర్థం కాకపోతే వివరిస్తాను…’ అని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయమై విలేకరులు అడిగినప్పుడు…‘సర్వేలో నా కుమారుడు గెలుస్తాడని వస్తేనే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఎప్పుడో చెప్పాం. ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న అవతలి వ్యక్తికి అలా చెప్పే ధైర్యం లేదు…’ అని వివరించారు.