న్యాయవ్యవస్థా…నీ పయనం ఎటు…?

న్యాయవ్యవస్థా…నీ పయనం ఎటు…?
******************************************
మన దేశములో సామాన్య ప్రజలకే కాదు కీట,పశుపక్ష్యాదులకు, సమస్త జంతు జాలానికి సమాన న్యాయాన్ని అందించే ఒక గొప్ప ఆదర్శవంతమైన వ్యవస్థ ఉండినది. అటువంటి న్యాయవ్యవస్థే ప్రజల్ని రక్షించుకున్నది .
పూర్వంలో..రాజుగారి గుమ్మం దగ్గరికి వచ్చిన గోవు ఆకలేసి ఎదురుగా ఉన్న ఒక గంటకు కట్టబడిన తాడును నమలబోయి నోటితో లాగిన వెంటనే గంటలు మ్రోగాయి …రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం గ్రహించి ఆవు యొక్క యజమానిని పిలిపించి ఆకలిగొన్న ఆవుకు ఆహారం ఇవ్వమని ఆదేశించారు ఇటువంటి రాజులు ఏలిన రాజ్యం మనది.

ఒక సామాన్యుడి మాటకు కూడా విలువనిచ్చి స్పందించిన రాముడి వంటి వ్యక్తులు పరిపాలించిన రాజ్యం మనది .
ఇటువంటి పవిత్ర భారతదేశంలో న్యాయవ్యవస్థ ఎటు పోతున్నది గాడితప్పి గమ్యం లేకుండా పరుగులు తీస్తున్నదా…?
అనేక అవమానాలు పొందిన ప్రజల్లో అనుమానాలు పెల్లుబుకుతున్నాయి.
దానికి కారణం కోర్టులు వాటి మాధ్యమంగా జరుగుతున్న న్యాయపరమైన తతంగం .
దీనంతటికీ కారణం ఎవరు..?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి విభాగానికి సంబంధించిన నియుక్తులు ఆ విభాగం వారు చేసుకోకూడదు .
కానీ న్యాయవ్యవస్థలో తమ వారసులనుండి బంట్రోతు వరకు తామే ఎన్నుకొనే ప్రక్రియ సబబేనా…?

ఒక సుప్రీంకోర్టు జడ్జి పైన నమ్మకం లేదని రోడ్డుపైకి వచ్చి పత్రికా సమావేశం పెట్టి, ప్రజల మధ్యకు వచ్చి పార్టీలను ప్రజలను చీఫ్ జస్టిస్ పైకి ఉసిగొలిపి అభిశంసన పేరుతో భయపెట్టి,న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసిన వ్యక్తులు అదే పీఠంపై నేడు అధిరోహించారు …! అన్నట్టు వీరికి న్యాయం జరిగిందా..? లేదా..?
పెద్ద న్యాయమూర్తి పై పేపర్ల కెక్కిన ఇటువంటి వారు ప్రజలకు న్యాయం చేయగలరని నమ్మవచ్చా….?

న్యాయమూర్తుల నియామకం దగ్గర నుండి ఉద్యోగుల నియుక్తి , తీర్పుల ఆలస్యము వరకు మరియు తమకు అనుకూలమైన తీర్పుల విషయంలో స్వార్థ రాజకీయ నాయకుల పాత్ర ఉన్నదని బాధిత ప్రజలు అనుకుంటున్నారు కాదనడం సాహసమే అవుతుంది…!

ఆలస్యమైన న్యాయము అన్యాయం తో సమానం అంటూ వల్లెవేసే ఈ పెద్దలే…
దశాబ్దాలకు పైగా కోర్టుల్లో నానుతున్న కేసుల గురించి పల్లెత్తు మాట అనరు ఎందుకు..?
చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలని వల్లెవేసే వీరు చిన్నా చితకా కేసులలో కోర్టు వరకు పోకుండా స్థానికంగానే పోలీస్టేషన్లలో బెయిల్లు తీసుకోవచ్చు అంటే అంతెత్తు ఎగిరి…అరిచి గీ పెట్టారు .అటు జడ్జీలు మరోవైపు న్యాయ వ్యవస్థను కాపాడుతామని, సామాన్యునికి న్యాయం అందిస్తామని ప్రతిజ్ఞ చేసిన నల్లకోటు లాయర్లు. వీరి విజ్ఞప్తులు లేదా విజ్ఞప్తుల మాటున దాగి ఉన్న బెదిరింపులో… కారణం ఏమైనప్పటికీ ప్రభుత్వం చేసిన నిర్ణయం వెనక్కి తీసుకుంది .
చిన్నాచితకా కేసులలో కూడా కోర్టు గుమ్మాలకు సాగిల పడే సామాన్యుని కష్టాలకు అంతే లేదు… ఈ కష్టాలను ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి.

తీర్పు చెప్పడానికి కోర్టుల్లో తగిన సంఖ్యలో జడ్జీలు లేరు అవసరాలకు తగిన సంఖ్యలో వారి నియుక్తి జరుగలేదు .. జడ్జీలు సరిపోక పెండింగ్ కేసులు లక్షల సంఖ్యలో దాటిపోయాయి.
ప్రాచీన కాలం నాటి న్యాయవ్యవస్థ అంటే గ్రామంలోనే తగాదాలకు తీర్పులు చెప్పే వ్యవస్థ ఉండేది …తీర్పులు చెప్పే వ్యక్తి సచ్చీలుడై ,ధర్మము ,న్యాయము… గురించి తీర్పు చెప్పగలగడమే కాదు స్వయంగా తాను ఆచరించేవాడు .
ఆచరించి చూపే వ్యక్తులు మాత్రమే న్యాయం చెప్పగలరు అనే నీతిని అనుసరించి తీర్పులు చెప్పే వాళ్ళు . నా వ్యక్తిగత జీవితం -నా ప్రజా జీవితం అంటూ వేరు వేరుగా ఉండేవికావు .
కానీ నేటి స్థితి ఏమిటి ..?
ఎవరి జీవిత చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం..! అన్న చందముగా భోగలాలసులై, ధనకక్కుర్తితో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి న్యాయం చెప్పవలసిన జడ్జీలే జైల్లో ఉన్నారు.
మహిళలపై అరాచకాలు చేసి ఉద్యోగాలు ఊడగొట్టుకున్న వారు ,అరెస్టయి జైలుపాలైన జడ్జీలు ఉన్నారు.
రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుని వారి అడుగులకు మడుగులొత్తుతూ వాళ్లు తానా అంటే తందానా అంటూ నిరపరాధులను సంవత్సరాల తరబడి జైల్లో పెట్టిన చరిత్ర కలిగిన జడ్జీలు కొందరైతే.., పార్లమెంట్ భవనాన్ని పేల్చివేయడానికి కుట్రపన్ని ఉరిశిక్ష విధించబడిన అఫ్జల్ గురుకు బెయిల్ ఇవ్వడానికి మధ్య రాత్రి రెండు గంటలకు కోర్టు తలుపు తెరిచి కూర్చున్న మహా జడ్జీలు కొందరయితే,

వేలాది మంది హత్యలకు కారణమైన నక్సలైట్లకు గురువులు అయిన అర్బన్ నక్సలైట్లు పట్టుబడి వాళ్లను జైలుకు పంపిస్తామంటే… వారిని రక్షించడానికీ, బెయిల్ ఇప్పించడానికీ.., మధ్యరాత్రి నానా రభస చేసి జైలుకు వెళ్లవలసిన వారిని ఇంట్లోనే ఉండమనీ…,పాపపంకిలం తలపైన పెట్టుకుని బెయిల్ ఇప్పించిన జడ్జీలు కొందరైతే, సాధ్వి ప్రజ్ఞ సింగ్ వంటి అనేక మంది నిరపరాధులను సంవత్సరాల తరబడి బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచి పోలీసులచే అనేక ఆగడాలకు గురికాబడడానికి కారణమయ్యారు మరికొందరు…

– తమిళనాడులో తమకిష్టమైన,తామే ముద్దుగా పెంచుకున్న బలిష్టమైన ఒక ఆంబోతును ఆపడము అనే శక్తి ప్రదర్శన క్రీడ “జల్లికట్టు” ఈ ఆటలో బలిష్టమైన ఎద్దులు అంత మంది యువకులు ఒక్కసారిగా ఆపాలని ఎగబడితే చాలా బాధపడి పోతున్నాయి, ఆ ఎద్దులను కష్టపెడుతున్నారు అని ఎవరో మహానుభావులు కేసు వేస్తే నిజమే.., జల్లికట్టు ఆటలను ఆపి వేయండి అని ఆర్డర్ వేసిన ఈ పెద్దలే ….,
అల్లానా , అల్ కబీర్ వంటి పెద్ద పెద్ద “యాంత్రిక పశు వధశాలలు” భారతదేశం నుండి లక్షల సంఖ్యలో ఆవులను ఎద్దులను చంపి రక్తము,మాంసం విదేశాలకు తరలిస్తున్నారు ఆపండి మహాప్రభో అంటే మాకేం తెలియదు అంటూ మొఖం చాటేసారు…,
ఈ మహామహులైన కోర్టుల వారిని ఎవరు ప్రశ్నించాలి…?
సృష్టిలో మగవారు ఆడవారిని వివాహం చేసుకోవడం పిల్లల్ని కనడం సహజం .
కానీ మహా మహులైన కోర్టు వారు ఎవరో అడిగారనీ… ఆడవాళ్లు ఆడవాళ్ళను , మగవాళ్ళు మగవాళ్ళనీ వివాహం చేసుకోవచ్చు …అని సృష్టి విరుద్ధమైన మరియు భారత దేశ ప్రజల సాంస్కృతిక విలువలకు విరుద్ధమైన తీర్పు ఇచ్చిన ఘనత వీరిదే…
ఆశ్చర్యం ఏమిటంటే ఇదే కేసుపై గతంలో తీర్పు ఇచ్చిన జడ్జి గారి తండ్రిగారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ధర్మం, ప్రకృతి నియమాలు తెలిసిన ఆ.. పాత జడ్జిగారు దీనిని తప్పుపట్టారు. అదే కేసుపై నేటి సుప్రీంకోర్టు జడ్జి గారు ఇలా తీర్పునిచ్చారు నవ్వాలా ..? ఏడవాలా ..? ప్రశ్నించాలా..? నెత్తి నోరు బాదుకోవాలా..? లేక తిరగబడాలా..?

దీపావళిలో బాణాసంచా కాల్చడం వలన ప్రకృతి కాలుష్యం అవుతుందని సెలవిచ్చిన మాన్యులు, డిసెంబర్ 25 నుండి 31 రాత్రి , జనవరి ఒకటవ తేదీ తేదీలలో కాల్చే బాణసంచాపై నోరు విప్పరు…
హోలీ సమయంలో రంగులను కడుక్కోవడానికీ, బట్టలు ఉతకడానికి నీళ్లు అధికంగా ఖర్చవుతున్నాయి అని వ్యాఖ్యానించిన కోర్టులు …శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆడే “హండీ” (ఉట్టి కొట్టడం) ఎంత ఎత్తు ఉండాలి అని నిర్ధారించడానికి సమయం దొరికిన కోర్టు వారికి…, హిందూ యువతులు 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించలేక పోవడం వలన అగచాట్లు పడుతున్నారని ఇది మానవ హక్కుల ఉల్లంఘన అనే “ఒక క్రైస్తవ మహిళ మరియు ఒక ముస్లిం మహిళ” …! పెట్టుకున్న అర్జీపై మహామహులైన సుప్రీంకోర్టు జడ్జి వారు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ….
మసీదులలో ,దర్గాలలో …పూజలు నమాజులూ చేయడానికి అనుమతి ఇవ్వండి అని వేడుకొంటే.. మైనారిటీల విషయంలో మేము జోక్యం చేసుకుంటూ న్యాయం చెప్పలేకపోయారు… !
హైదరాబాద్ వంటి నగరాల నుండి చిన్న పిల్లలను విదేశాలకు “నిఖా” చేసుకొని వెంట తరలించుకుపోయే దుబాయి అరబ్బు దేశాలకు చెందిన వారిని ఆపలేకపోయారు …,లేత బుగ్గల చిన్నారులను కాపాడలేకపోయారు.
ఇంతే కాక…,
దేశ రక్షణకై శారీరక, కౌటుంబిక కష్టాలను ఎన్నో… ఎదుర్కొంటూ కాశ్మీరులో నిలిచి పగవానితో పోరాడుతున్న మన సైనికులపై రాళ్ళు విసిరే దుండగులను ఆపే క్రమంలో సైనికుల లాఠీ దెబ్బలు,రబ్బరుబుల్లెట్ల, పిల్లెట్ల దెబ్బలు తగిలిన విదేశీ భావప్రేరిత లైన దేశద్రోహులకు వారి వైద్య ఖర్చులను సైనికుల జీతాలలో నుండి కత్తిరించి ఖర్చులు కట్టించండి అంటూ తీర్పు చెప్పిన జడ్జీలు…
పాకిస్థాన్ కు తొత్తులుగా మారి మన సైనికులను హతమార్చిన లేదా వికలాంగులుగా మార్చిన దుండగులను మన సైనికుల కుటుంబాలకు లేదా వారి వైద్య ఖర్చులు చెల్లించాలి అని ఎందుకుచెప్పరు..? తీవ్రవాదులు చెల్లించాలి, లేక తీవ్రవాదులకు మద్దతుగా వ్యవహరిస్తున్న కాశ్మీర్ ముస్లింలు చెల్లించాలి…? లేదా తీవ్రవాదులకు వత్తాసు పలికే రాజకీయ పార్టీల వారు చెల్లించాలి అని ఎందుకు చెప్పరు…?

ఇక రామజన్మభూమి మందిర కేసు విషయమే తీసుకుందాం …విదేశీ చొరబాటుదారుల చేతిలో ఆక్రమణకు గురై 1528వ సంవత్సరం నుండే ..,
ఆక్రమణకు గురైన భూభాగంపై నిర్మించబడిన కట్టడం తొలగించాలనీ … అయోధ్య రాముడికి భవ్యమైన మందిరం నిర్మించుకుంటామని జరుగుతున్న ఉద్యమం విధితమే దేశరక్షణ, ధర్మరక్షణ కై ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 40 లక్షల మంది బలయ్యారు…
1934 లో అంటే దేశ స్వాతంత్య్రానికి ముందే ఈ విషయమై కోర్టులో కేసువేశారు …మధ్యలో అనేక మలుపులు …ఈ కేసులో న్యాయం లభించడానికి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఎందుకు తాత్సారం చేస్తున్నాయి కోర్టులు. దీని వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది …?
అనవసర ఆలస్యం కారణంగా ఎంతటి నష్టము, విపత్తు జరిగిందో .., జరుగుతున్నదో లెక్కించారా…? ఎవరైనా ..?

2010 లో అలహాబాద్ హైకోర్టు రామజన్మభూమి మందిర స్థలములో గతంలో భవ్యమైన మందిరము ఉండేదని, అది కూల్చి వేయబడినది అనీ, దాని రాళ్లతోనే 1992 డిసెంబర్ 6 న కూల్చబడిన కట్టడం …కట్టబడిందనీ …, అట్టి ఆలయం మరియు భూమి…బాలరాముడికే చెందుతుందనీ..,ఇది శ్రీరాముని జన్మభూమి అంటూ నిర్ధారించి కూడా, “రామ్ లలా” (బాల రాముడు) కి అప్పగించకుండా… ముగ్గురు కక్షిదారులలో ఎవరూ కోరని తీర్పు అంటే “మూడు భాగాలుగా చేస్తూ తీర్పును ప్రకటించారు”….
ఇది ఎవరిని సంతృప్తి పరచడానికి ఇచ్చిన తీర్పు…?

ఇంట్లోకి దూరిన దొంగలపై వాళ్లని వెళ్ళగొట్టి మా ఇంటిని మాకు అప్పగించండని ఫిర్యాదు చేస్తే … ఇల్లు మీదే కానీ దొంగలు చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నందున నీ ఆస్తిలో వాళ్లకు కూడా వాటా చెందుతుంది …అంటూ తీర్పు ఇవ్వడం ఏపాటి న్యాయము…? ఇది ఎలాంటి తీర్పో చిన్న పిల్లవాడికి కూడా అర్ధం అవుతున్నది.

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత “రామ్ లలా” 2010వ సంవత్సరంలో సుప్రీంకోర్టు కెళ్లాడు.

25 వేల పేజీల హిందీ కోర్టు పత్రాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయడం మా పని కాదంటూ కోర్టు తన బాధ్యత నుంచి తప్పుకొని చేతులెత్తేసింది .
లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన నిపుణులైన భాషావేత్తలతో ఆంగ్లంలోకి మార్చడానికి విశ్వహిందూ పరిషత్ కు ఎంత కష్టమైందో …ఇక అప్పుడు వచ్చారు కక్షిదారులలో మమ్మల్ని కూడా చేర్చుకోండి (“ఇంప్లీడ్”)అంటూ 15 మంది …

విన్నవించుకొన్న వారిని విచారించడంలోనే ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోయింది…జస్టిస్ దీపక్ మిశ్రా కాలం తీరిపోయింది. ఆయన 15 మంది ఇంప్లీడ్ గా వచ్చిన వారిని నిరాకరించారు ..

2018 అక్టోబర్లో సుప్రీంకోర్టుజడ్జిగా వచ్చారు గొగోయ్ గారు, …తెలుగునాట సామెత “రెడ్డి వచ్చే మొదలెట్టు” అన్నట్టుగా రామజన్మభూమి వివాదం కేసు కథ మళ్లీ మొదటికి వచ్చింది.కొత్తగా వచ్చిన జడ్జిగారు మొదట మూడు నిమిషాల సమయం ఇచ్చి మూడు నెలల తర్వాత మళ్లీ రండి అంటూ …,పనిలో పనిగా మా యొక్క ప్రాథమ్యాలలో రామజన్మభూమి కేసు లేదంటూ కూడా తన మనోగతాన్ని బయటపెట్టాడు …
మళ్లీ మూడు నెలల తర్వాత జనవరి 10వ తేదీన వచ్చిన రామజన్మభూమి కేసుపై కొన్ని సెకన్లు మాత్రమే సమయం ఇచ్చి మాట్లాడుతూ కొత్త కొత్త మలుపులు తిప్పుతున్నారు.అంటే…,

8 సంవత్సరాల కాలానంతరం కూడా ఈకేసు విషయంలో ఎవరు వినాలి …?
ఎవరు తీర్పు చెప్పాలి …?
అంటే ముగ్గురు న్యాయమూర్తుల బెంచా, ఐదుగురు న్యాయమూర్తుల బెంచా అంటూ శ్రీమాన్ సుప్రీంకోర్టు వారు మాట్లాడుతున్నారు .
పనిలో పనిగా అనవసరమైనవిగా దిగిపోయిన జడ్జి గారు దీపక్ మిశ్రా నిరాకరించిన 15 మంది ఇంప్లీడ్ లను కూడా కేసు లో భాగంగా చేస్తామని ప్రకటించారు.

ఇలా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా స్పందించి ఒక్కొక్క పద్ధతిలో తీర్పులు ఇస్తున్న వైనాన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి..?

ప్రజల కష్టార్జితంలోని భాగాన్ని టాక్స్ రూపంలో,సెస్ రూపంలో ప్రభుత్వానికి జమ చేయగా… అందుండి పొందిన జీతాన్ని , మరియు సకల సౌకర్యాలను అనుభవిస్తూ ప్రజలకు మేము జవాబుదారీ కాదు అనే ప్రభుత్వ విభాగాలను ప్రజలు బరాబర్ ప్రశ్నిస్తారు… ప్రశ్నించి తీరుతారు …?
ప్రజలకు న్యాయం చెప్పే న్యాయమూర్తులు తమ జీవితంలో కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతివంతంగా జీవిస్తున్నారా పద్ధతిగా పని చేస్తున్నారా లేదా అని కూడా తరచి తరచి చూస్తారు …ప్రశ్నిస్తారు. ఇది ప్రజల మనోగతం…
దానికి విలువనివ్వడం ప్రభుత్వ పాలకులు,మరియు ఉద్యోగులైన వారందరి కనీస బాధ్యత.
-ఆకారపు కేశవరాజు.
విశ్వహిందూ పరిషత్

About The Author