భారతీయ శిక్షా స్మృతిలో నూతన శకం ఆరంభం..
భారతీయ శిక్షా స్మృతిలో నూతన శకం ఆరంభం.
చట్టంగా మారిన క్రిమినల్ బిల్లుల
మూడు నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం పంపించింది. తాజాగా, ఇవాళ ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల కావడంతో ఈ మూడు బిల్లులు ఇక చట్టాలుగా మారనున్నాయి. కాగా, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లలో కొన్ని సవరణలతో పాటు.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. ఆ మూడు చట్టాల పేర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లులను తీసుకువచ్చింది. ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్దత కలిగింది. ఇకపై ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్పీసీ ప్లేస్‌లో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధీనం పేర్లు కనబడనున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఇక కనుమరుగుకానున్నాయి.