ఓ ఆరు నెలల బిడ్డ నవ్వులో చావు దాగుంది…

https://www.youtube.com/watch?v=RiyXHbo7sEc

ఓ ఆరు నెలల బిడ్డ నవ్వులో చావు దాగుంది.
ఆ బిడ్డ నిద్రలోకి జారుకుంటే కబళిద్దామని మృత్యువు పొంచి ఉంది.

బిడ్డ నిద్రపోతే తనకు దూరమవుతాడని తల్లి గిచ్చి మరీ లేపుతోంది. ఈ విధంగా బిడ్డను కాపాడుకుంటోంది. ఆమె మాతృత్వమే ఇప్పుడు శాపమై వెంటాడుతోంది. దాన్ని వరంగా మార్చుకునేందుకు, బిడ్డను కాపాడుకునేందుకు, ఉన్నదంతా ఖర్చుపెట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. ఈ బాలుడి పేరు యదార్థ్. వయసు 6 నెలలు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కంజెనిటల్ సెంట్రల్ హైపో వెంటిలేషన్ (CCHS) అనే వ్యాధితో ఈ బాలుడు బాధపడుతున్నాడు. నిద్రపోతే ఆ బాలుడు చనిపోతాడు. నిద్రలో మెదడుకు ఆక్సిజన్ తగ్గి ఆ బాలుడికి తెలియకుండానే ప్రాణం పోతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి వైద్యులు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో తల్లి తన ఆరునెలల బిడ్డ నిద్రపోతే గిచ్చి మరీ లేపుతోంది. నిద్రలోకి జారుకోనీయకుండా నిరంతరం కాపలా కాస్తోంది. రాత్రయితే పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి నిద్రపోయేందుకు అవకాశం ఇస్తోంది. పగలు మాత్రం తను లేకుండా ఆ బిడ్డ నిద్రపోవడానికి లేదు. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా కదలడానికీ లేదు. పాపం ఆ తల్లికి ఇదో నరకం. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఈ బాలుడికి ఆపరేషన్ చేసి ఈ వ్యాధిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతకాలంగా ఉన్నదంతా ఖర్చుపెట్టుకుని ఇప్పుడు బిడ్డ ఆపరేషన్ కోసం తల్లి దాతల సాయం కోరుతోంది. ప్రపంచంలో పదుల సంఖ్యలోనే ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. ఇది జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. నిద్రపోయే సమయంలో శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గి మెదడు క్రమంగా పనిచేయడం మానేస్తుంది. దీంతో గుండెకు, శరీరంలోని ఇతర భాగాలకు ప్రాణవాయువు అందదు. రక్తం సరఫరా కాదు. ఇది గంటల్లోనే చావుకి దారితీస్తుంది. ఇంత భయంకరమైన వ్యాధి ముద్దులొలికే ఈ చిన్నారికి రావడం దయనీయం.

About The Author