5 దశాబ్దాలు ….15 లక్షల పుస్తకాలు


కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణం తాలూకా హరళహళ్లిలోని పుస్తకాల ఇల్లు అది. పరిశోధక విద్యార్థులు, రచయితలు,ఉపాధ్యాయులు, విమర్శకులు, పోటీ పరీక్షల ఆశావహులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది.

ఎందుకంటే వారికి ఆ ఇల్లు జ్ఞాన భాండాగారం. నవలలు, సాహిత్యం, పురాణాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమాలు, క్రీడలు.. రంగం ఏదైనా అక్కడ పుస్తకం దొరుకుతుంది. 8 విదేశీ భాషలు, 22 భారతీయ భాషలకు చెందిన 15 లక్షల పుస్తకాలు ఉన్నాయి.

వీటన్నింటినీ సేకరించింది ఒకే ఒక్కరు. ఆయనే మండ్య సమీపంలోని కెన్నాళ్లు గ్రామానికి చెందిన #అంకేగౌడ(76). తన కాలేజీ రోజుల్లో పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో.. సొంతంగా కొన్ని పుస్తకాలు కలిగి ఉండాలని వచ్చిన ఆలోచన, తర్వాత రోజుల్లో ఆయన జీవిత ఆశయమైంది. అలా 21సంవత్సరాల వయసులో పుస్తకాల సేకరణ ప్రారంభించిన ఆయన ఐదు దశాబ్దాలుగా మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.

అంకేగౌడ మండ్య చక్కెర పరిశ్రమలో 30 ఏళ్లు కార్మికుడిగా పనిచేశారు.ఆ సమయంలో తన జీతంలోని 80 శాతాన్ని పుస్తకాల కోసమే వెచ్చించారు. కొంతమేర దాతలు సహకారం అందిస్తున్నారు. పాఠకులు తమ ఇంట్లోని పుస్తకాలను తీసుకొచ్చి ఇస్తుంటారు.

సహాయకులను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ స్వంత గ్రంథాలయాన్ని కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నారు.రోజూ గ్రంథాలయాన్ని శుభ్రం చేసి, పుస్తకాలను క్రమపద్ధతిలో పేర్చడానికి అంకేగౌడ నిరంతరం శ్రమిస్తుంటారు.

About The Author