అవినీతి అంధకారంలో అధికారులు…
కనుమరుగైపోయిన చెరువులను మత్స్యకార సంఘాలకు లీజుకు!
కనుమరుగైపోయిన చెరువులకు మత్స్యకార సంఘాలకు అప్పగించి లీజు వసూలు చేయడాన్ని చూస్తుంటే అసలు వీళ్ళకి చెరువులు కనుమరుగు అయిపోయాయి అన్న విషయమే తెలియదని అర్థమవుతుందని ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లు సత్యం ఒక ప్రకటనలో తెలియజేశారు. రికార్డుల్లో చెరువు ఉండి, భౌతికంగా అక్కడ చెరువు లేనప్పటికీ చెరువు ఉన్నట్లు భావిస్తున్నారంటే చెరువులు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుందన్నారు. నిజానికి చెరువులను గుర్తించటానికి రెవెన్యూ శాఖ, వాటిని పరిరక్షించడానికి గ్రామాల్లో అయితే పంచాయతీరాజ్, పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్ శాఖలు, చెరువులను నిర్వహించటానికి ఇరిగేషన్ శాఖ, కాలుష్యానికి గురికాకుండా చూడటానికి కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జలాలను పర్యవేక్షించే శాఖ… ఇలా చెప్పుకుంటూ పోతే అనేక శాఖల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఒక్క చెరువును కూడా పరిరక్షించ లేకపోతున్నారంటే ఈ వ్యవస్థలన్నింటిలో ఏ ఒక్క వ్యవస్థ పని చేయడం లేదా ? లేదంటే అన్ని వ్యవస్థలు అవినీతిలో కూరికి పోయాయా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా మనకు వ్యవస్థలు ఉన్నాయని,మనల్ని కాపాడతాయన్న భ్రమల్లో ప్రజలు ఉండటాన్ని చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుందని, అదే సమయంలో భయం కూడా వేస్తుందన్నారు,ఎందుకంటే మనం బతికేది మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా,వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మన కోసం, భవిష్యత్ తరాల మనుగడ కోసం నిర్మాణాత్మకంగా ఆలోచించి వ్యవస్థలు బలోపేతానికి, తద్వారా జీవకోటి మనుగడకు దోహదపడదామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు