ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు..
మనోగతం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
“ యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే || ”
ఉత్తములు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇతర జనులు, సమస్త లోకము అనుసరిస్తుందని ఈ శ్లోకం భావం. సనాతన భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా మారింది అలాంటి ఉత్తమ లక్ష్యం కారణంగానే. ఇప్పుడు మళ్లీ ప్రపంచం భారతదేశం వైపు చూసేలా చేసిన నాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ. ఇవాళ వారి 75వ పుట్టినరోజు. పంచసప్తతిలోకి అడుగు పెట్టిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఓ మనిషి గొప్పతనం, తాను సాధించిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే శ్రీ మోదీ గారు సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. అయితే ఆయన తన కోసం ప్రత్యేకంగా ఏదీ సాధించుకోలేదు. దేశం కోసం సాధించారు. ఒక పౌరుడిగా, ఈ దేశ పూర్వ ఉపరాష్ట్రపతిగా, పదేళ్లకు పైగా ఆయన నాయకత్వంలో మన దేశం సాధించిన అద్భుతమైన అభివృద్ధిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆయన పాలన అభివృద్ధి తోపాటు ప్రజల సంక్షేమానికి కూడా పెద్దపీట వేసింది. ప్రత్యేకించి ప్రపంచమంతా భారతదేశాన్ని ఈరోజు తలఎత్తి చూస్తుందంటే దానికి కారణం ఆయనే అని చెప్పడానికి నేను సంకోచించను. ఇక్కడి ప్రజల మనసుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనదైన సంస్కృతిని మళ్లీ ఉన్నతంగా నిలబెట్టారు.
శ్రీ మోదీ గారి దార్శనికత చాలా స్పష్టం. ఆయన పాలనలో ‘భారతదేశమే ముందు’ అనేదే ప్రధాన సూత్రం. విదేశీ విధానాల నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింట్లోనూ ఇదే కనిపిస్తుంది. సంక్షేమ పథకాల అమలులో, మౌలిక సదుపాయాల నిర్మాణంలో, ఆర్థిక నిర్వహణలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో ధైర్యంతో కూడుకున్నవి. ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలంటే కేవలం ధైర్యం మాత్రమే చాలదు, అకుంఠిత దేశభక్తి ఉన్నప్పుడు, మిగిలిన వారిలోనూ వాటిని బలంగా నాటినప్పుడే ఇలాంటివి సాకారం అవుతాయి. గత పదేళ్ళలో భారతదేశం అలాంటి ఎన్నింటినో అలవోకగా సాధించింది.
అభివృద్ది అంటే కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించడం. జన్ ధన్-ఆధార్-మొబైల్ (JAM) లాంటి పథకాలు అవినీతికి అడ్డుకట్ట వేసి, లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందేలా చేశాయి. ఆయన నాయకత్వంలో భారత్ సాధించిన విజయాలు ప్రస్తావించుకోవడానికి ఇదొక మంచి సందర్భమే. భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలోనే మూడో స్థానానికి చేరుకోవడం ఖాయం. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశంలో పేదరికం 27.1% నుంచి 5.25%కి తగ్గింది. ఇది ఒక గొప్ప విజయం. జల్ జీవన్ మిషన్ కింద 15.59 కోట్ల ఇళ్లకు తాగు నీరు వచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మితమయ్యాయి. వ్యవసాయ బడ్జెట్‌ను దాదాపు ఐదు రెట్లు పెంచారు. పీఎం-కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులకు డబ్బులు నేరుగా అందుతున్నాయి. స్టార్టప్ ఇండియా వల్ల మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా మారింది. యూపీఐ లావాదేవీల్లో మన దేశం నంబర్ 1గా ఉంది.
నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడం నాకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది. అలాగే, ముమ్మారు తలాక్‌పై చట్టం తీసుకొచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ , అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మన సంస్కృతిని మరింత నిలబెట్టాయి.
ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రజాభాగస్వామ్యంతో సాధించినఈ విజయాలు మన ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసేందుకు బలమైన పునాదులు వేస్తున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల బలం, బలగం రెండూ మోదీనే. నాయకత్వానికి మారు పేరుగా నిలిచిన నరేంద్ర మోదీకి అధికారం అంటే ఆశ కాదు… కోట్లాది దేశ ప్రజలకు సేవ చేసుకునేందుకు దొరికిన అవకాశంగా ఆయన భావిస్తారు. అందుకే ఆయన ప్రతి అడుగు దేశ సంక్షేమం కోసమే, ప్రతి ఆలోచన దేశ ప్రజల భవిష్యత్ కోసమే. “సబ్ కా సాథ్… సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్” మంత్రంతో సమ్మిళిత అభివృద్ధి, అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రజా భాగస్వామ్యంతో వారు చేస్తున్న కృషి నిరుపమానమైనది. . ఏదైనా దేశం తర్వాతే అని చేతల్లో చూపించే వారి వ్యక్తిత్వం విలక్షణమైనది. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టాలన్న సంకల్పం ఒకవైపు, దేశంలోని ప్రతిరాష్ట్రం ఆత్మనిర్భరత సాధించాలన్న ఆకాంక్ష మరోవైపు, ప్రతి వ్యక్తి నైపుణ్యంతో సగర్వంగా తలెత్తుకు నిలబడాలన్న అశ ఇంకో వైపు… ఆయన మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వరుసలో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నది అంత్యోదయ నినాదమైతే… చివరి వ్యక్తి సైతం స్వయం సమృద్ధి సాధించాలన్న ఆకాంక్ష ఆయనది.
పెద్దలు చెప్పినట్లు…
శరీరం క్షణ విధ్వంసి.. కల్వాంత స్థాయినో గుణః
అంటే భౌతిక శరీరం క్షణభంగురమే… అయితే మనం చేసిన సత్కార్యాలు, సద్గుణాలు వేల ఏళ్ళు జీవిస్తాయి. ఈరోజు సప్త చిరంజీవుల్లో పరశురాముడు, హనుమంతుడు, వ్యాసుడు, బలిచక్రవర్తి వంటి మహనీయులను స్మరించుకుంటున్నామంటే దానికి కారణం వారు లోకానికి చేసిన ఉపకారం మాత్రమే. శ్రీ నరేంద్ర భాయ్ మోదీ ఆలోచనలు, ఆచరణలు భవిష్యత్ తరాలకు వెలుగు బాటలుగా ముందుకు నడుపుతాయని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. మాతృభూమి సేవలో, సామాన్యుడి ఆకాంక్షగా మారి అహరహం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శతమానం భవతి.