అందుబాటులో ‘రైల్‌ మదద్‌’ యాప్‌…

అందుబాటులో ‘రైల్‌ మదద్‌’ యాప్‌
35 రకాల ఫిర్యాదులకు అవకాశం
సిబ్బంది ఆగడాల ఆటకట్టు
ప్రయాణికుల సేవలో తరిస్తున్న రైల్వేశాఖ
హైదరాబాద్‌: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ కొన్ని నెలల క్రితం ‘రైల్‌ మదద్‌’ పేరుతో కొత్త ఫిర్యాదులయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో తాము పడిన ఆవేదనను సగటు ప్రయాణికుడు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా రైల్‌ మదద్‌కు ఫిర్యాదు చేయొచ్చు. దీనికి రైలు ప్రయాణికుడై ఉండి, టికెట్‌ ఉంటే చాలు. ఇలాంటి ఫిర్యాదులకు రైల్వే మంత్రిత్వశాఖ వెంటనే స్పందిస్తుంది.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా…
స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన ప్రయాణికుడు ముందుగా గూగూల్‌ ప్లేస్టోర్‌కు వెళ్లి ‘రైల్‌ మదద్‌’ అనే అక్షరాలను టైప్‌ చేయాలి. వెంటనే దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. రైల్‌ మదద్‌ యాప్‌ ఓపెన్‌ కాగానే ముందుగా ప్రయాణికుడు తన పేరును నమోదు చేసుకోవాలి. తర్వాత ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసిన వెంటనే ఓటీపీ నంబర్‌ వస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా ఓటీపీ బాక్స్‌లో వచ్చి చేరుతుంది. తర్వాత వెంటనే రిజిస్టర్‌ ఆప్షన్‌ నొక్కగానే ‘మీ సమస్య ఏమిటి ప్రయాణికుడా’ అంటూ కింద ఆప్షన్లు వస్తాయి. అందులో రైలు, స్టేషన్‌కు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఈ సందర్భంగా ప్రయాణికుడు ఏ రకమైన సమస్యను ఎదుర్కొంటే దానిపై క్లిక్‌ చేయాలి. వెంటనే మీరు పంపిన సంఖ్యకు ఒక యూనిక్‌ నంబర్‌ కూడా వస్తుంది. దీని ద్వారా సమస్య ఎక్కడి వరకు పరిష్కారమైందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

రైలుకు సంబంధించిన ఫిర్యాదులు..
సీటు బెర్తుల కేటాయింపులో రైలు సిబ్బంది నిర్వాకం
బెడ్‌పై వేసుకునే దుప్పట్లు
బెర్తుల కేటాయింపులో లంచం, అవినీతికి పాల్పడడం
ఆహార పదార్థాల్లో నాణ్యత, సరఫరాలో జాప్యం
ఉద్యోగుల విధి నిర్వహణ, కోచ్‌ల నిర్వహణ, పరిశుభ్రత
విద్యుత్‌ సరఫరా, ఏసీల్లో లోపాలు
నీటి లభ్యత, తోటి ప్రయాణికులతో ఇబ్బంది
రైలు సమయం పాటించకపోవడం
రైళ్లలో దొంగతనాలు, దోపిడీలు

రైల్వేస్టేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులు..
లంచం, అవినీతి
స్టేషన్‌లో అపరిశుభ్రత
ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం
బుకింగ్‌ కార్యాలయం వద్ద భారీ క్యూ
ఫ్యాన్లు తిరగకపోవడం, రైళ్లు లేకపోవడం
రిజర్వేషన్ల వద్ద ఎదుర్కొంటున్న సమస్యలు
రైల్వేస్టేషన్‌ ముందు ట్రాఫిక్‌ స్తంభించడం
స్టేషన్‌లో దొంగతనాలు, దోపిడీలు
రైల్వేస్టేషన్‌లో నీటి కొరత, తదితర అంశాలు
ఫొటోలు కూడా జతచేయొచ్చు..
రైల్‌ మదద్‌ యాప్‌ తెరవగానే రైలు స్టేషన్ల ఫిర్యాదులు, హెల్ప్‌లైన్‌కు సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీకు అవసరమైన అంశాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లాలి. ఇక్కడ ఫిర్యాదు నమోదు కింద కెమెరా బొమ్మ ఉంటుంది. దానిని క్లిక్‌ చేసిన వెంటనే మీ సెల్‌ఫోన్‌లోని కెమెరా తెరుచుకుంటుంది. వెంటనే అందులో ఫొటో అప్‌లోడ్‌ చేయవచ్చు.

అధికారుల పర్యవేక్షణ..
యాప్‌లో వచ్చిన ఫిర్యాదులపై స్వయంగా రైల్వే జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు వెళ్లగానే ప్రయాణికుడికి ఒక నంబరు ఇస్తారు. దాని ద్వారా ఆయన ఫిర్యాదు ఎంతమేరకు పరిష్కారమైందనే వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా తెలియజేస్తారు.

టికెట్‌ తప్పనిసరి..
రైల్‌ మదద్‌లో ఫిర్యాదు చేసే వ్యక్తికి టికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఒక వేళ స్టేషన్‌లోని సమస్యలపై ఫిర్యాదు చేస్తే అతడు అన్‌ రిజర్వ్‌డ్‌ టికె ట్‌ అయినా కలిగి ఉండాలి. లేదా ఫ్లాట్‌ఫాం టికెట్‌ అయినా పొంది ఉండాలి. వీటి మీద ఉన్న నంబర్లను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఫిర్యాదు అధికారులకు చేరుతుంది

About The Author