నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు…రంగంలోకి మహిళా కమిషన్..!

మహిళా కమిషన్కు ఫిర్యాదుల వెల్లువ…అసభ్య కంటెంట్ పై తీవ్ర అభ్యంతరాలు*
విదేశాల్లో ఉన్న యూట్యూబర్ పై చర్యలు…జాతీయ మహిళా కమిషన్ కు కేసు బదిలీ*
ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ “నా అన్వేషణ” చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. సదరు ఛానల్‌లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు భారీస్థాయిలో ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది.
ప్రధానంగా మహిళలను వస్తువుల్లా చిత్రీకరించడం, వారి పట్ల అసభ్యకరమైన , అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, కొన్ని వీడియోలలో బాలల హక్కులను ఉల్లంఘించేలా , చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది.
దీనికి తోడు హిందూ దేవతలపై అత్యంత అభ్యంతరకరమైన, భావోద్వేగాలను దెబ్బతీసేలా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటువంటి ప్రవర్తన సామాజిక నైతికతను , సమాజంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం సదరు యూట్యూబర్ భారతదేశం వెలుపల నివసిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం జాతీయ మహిళా కమిషన్ (NCW)కు బదిలీ చేసింది.
నిందితుడు విదేశాల్లో ఉన్నందున, అతడిని విచారణకు హాజరు పరిచే అధికారం , అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు జాతీయ కమిషన్‌కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వీడియో ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఇప్పటికే సేకరించి కేంద్ర అధికారులకు అందజేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం , సామాజిక విలువల పరిరక్షణే లక్ష్యంగా, ఈ వ్యవహారంలో అత్యంత కఠినమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ జాతీయ కమిషన్‌ను కోరారు. ఈ పరిణామంతో నా అన్వేషణ ఛానల్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
