నర్సు ఎవరోగానీ గీసిన బొమ్మ సూపర్…

ఈ నర్సు ఎవరోగానీ సూపర్…

భాష ఏదైనా భావం అర్థం కావడం ముఖ్యం అంటారు. ఇంగ్లీషు రాని ఓ చైనీస్ నర్సు అదే ప్రయత్నం చేసింది. తెల్లారితే శస్త్రచికిత్స జరగాల్సిన రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ లేఖలో తనకొచ్చిన ఇంగ్లీషు ముక్కలు రాసి, చిత్రాలు వేసి అందజేసింది. విదేశీ మిత్రుడి ద్వారా ఈ లేఖను సేకరించిన వాస్ప్‌డాగ్‌ అనే వ్యక్తి దానిని రెడిట్‌లో పోస్టు చేయగా దానిపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. అందులో నర్సు చెప్పాలనుకున్నది ‘ రాత్రి 10 తర్వాత ఏమి తినకూడదు, తాగకూడదు. ఉదయం 8గంటలకు నీకు శస్త్ర చికిత్స చేయాలి’ అనేది అసలు విషయం. అయితే శస్త్రచికిత్సకు సూచికగా ఆమె ఓ కత్తి గీసి దానికి ఓ రక్తపు చుక్క అద్దింది. దీన్ని పలువురు నెటిజన్లు రకరకాల అర్థాలు తీస్తూ తమకు తోచింది కామెంట్‌ చేస్తున్నారు. ఓ వ్యక్తి ‘ఈ రోజు రాత్రి 10తర్వాత మాకు నీరు, ఆహారం ఉండదు. తెల్లారగానే నిన్ను వండుకుంటాం’ అని అర్థముందని కామెంట్‌ చేశాడు. ‘హంతకుడికి కూడా చివరిసారి కోరుకున్న భోజనం అందిస్తారని, ఇతడికి అదికూడా లేదని’ మరోవ్యక్తి పేర్కొన్నాడు. మరో కామెంట్లో ‘రాత్రి తాగలేదే, తినలేదే అని బాధపడొద్దు. ఎందుకంటే పొద్దున్నే చంపేస్తాంగా’ అంటూ మరో కామెంట్‌ వచ్చింది. కొందరు మాత్రం ఆమె చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

About The Author