సిర్పూర్‌కు కాగితపు సిరి.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి…
https://www.facebook.com/arsh.nawaz.79/videos/1220435891491945/?t=4
సిర్పూర్‌కు కాగితపు సిరి
★ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
★ ఇచ్చినమాట ప్రకారం ఆరునెలల్లో పేపర్ ఉత్పత్తి ప్రారంభం
★ అంతా కొత్తగా ఉంది : రాజు, కార్మికుడు, ఎస్పీఎం
కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమకు మళ్లీ కళ వచ్చింది. 2014లో మూతపడిన పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ చొరవతో తెరుచుకున్నది. గురువారం రాత్రి 8.20 గంటలకు తిరిగి పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వర్క్స్ అండ్ డైరెక్టర్ పీకే సూరి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం యూనిట్ హెడ్ మయాంక్ జిందాల్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి ఉత్పత్తిని ప్రారంభించారు. అనంతరం మయాంక్ జిందాల్ కార్మిక కుటుంబాలకు చీరలు, స్వీట్స్ పంపిణీ చేశారు. అంతకుముందు రాత్రి 7.07 గంటలకు ఏడో నంబర్ యంత్రం వద్ద పీకే సూరి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజలు, హోమాన్ని నిర్వహించారు. చిప్పర్‌హౌస్‌లో నిల్వ ఉంచిన పల్ప్ (గుజ్జు) పేపర్‌గా మారి బయటకు వచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కాగితం ఉత్పత్తి జరిగింది. దీంతో మిల్లు కార్మికులు సంబురాలు చేసుకున్నారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో పేపర్ ఉత్పత్తి ప్రారంభం
——————————————————————–
నిజాం కాలంలో 1938లో ఎస్పీఎంను స్థాపించారు. 1950లో బిర్లాగ్రూప్ టేకోవర్ చేసింది. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-08లో మిల్లును ఐడీబీఐకి తాకట్టు పెట్టింది. అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న షట్‌డౌన్ చేసింది. కంపెనీ మూసేనాటికి 3,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది పరోక్షంగా ఉపాధిని పొందేవారు. 2016 అక్టోబర్ 22న మిల్లును ఐడీబీఐ స్వాధీనం చేసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు.
2017 డిసెంబర్‌లో వివిధ కంపెనీలు పలుమార్లు ఎస్పీఎంను సందర్శించాయి. వీటిలో జేకే కంపెనీ ఎస్పీఎంను తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఎస్పీఎంకు కల్పించాల్సిన రాయితీలపై 2018 మార్చి 4న మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకున్నది. పదేండ్లపాటు రాయితీలు కల్పిస్తూ మార్చి 18న ప్రభుత్వం జీవో-18ను విడుదలచేసింది. ఆగస్టు 2న అప్పటి మంత్రి కే తారకరామారావు ఎస్పీఎం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. యాజమాన్యం ముమ్మరంగా మరమ్మతు పనులు చేపట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లోనే పేపర్ ఉత్పత్తిని ప్రారంభించింది. వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి దక్కింది.
అంతా కొత్తగా ఉంది: రాజు, కార్మికుడు, ఎస్పీఎం
——————————————————————–
నేను రెండు నెలలుగా మిల్లులోని అటవీ విభాగంలో పనిచేస్తున్నా. ముడిసరకు కోసం ప్లాంట్‌లో నాటిన మొక్కలను పర్యవేక్షిస్తుంటా. మళ్లీ మిల్లులో అడుగుపెడుతామని అనుకోలేదు. ఈ రోజు పండుగలా అనిపిస్తున్నది. మా బతుకుల్లో వెలుగులు నింపిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం. కార్మికులందరం కష్టపడి పనిచేసి మిల్లుకు గతవైభవం తెస్తాం.