లోయర్ మానేరు డ్యాం లో ఐలాండ్…

★ ఎల్‌ఎండీలో కేసీఆర్ ఐలాండ్

★ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

★ అంచనా వ్యయం రూ.20 కోట్లు

★ అత్యాధునిక హంగులతో కాటేజీలు

★ ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఫ్లోటింగ్ రెస్టారెంట్

★ గుట్టపై భాగంలో ప్రెసిడెన్షియల్ సూట్

★ పిల్లలకు, పెద్దలకు వేర్వేరు స్విమ్మింగ్‌పూల్స్

★ లోయర్ మానేరు డ్యాం మధ్యలో 4 ఎకరాల్లో మైసమ్మగుట్టపై ఏర్పాటు

★ రూ.20 కోట్ల అంచనాతో రాష్ట్ర పర్యాటకశాఖ గ్రీన్‌సిగ్నల్

★ అంతర్జాతీయస్థాయి పరిజ్ఞానంతో కాటేజీల నిర్మాణం

★ ఫలించిన ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కృషి

కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) మరో పర్యాటక ప్రాంతానికి కేంద్రంగా మారబోతున్నది. ఇప్పటికే డ్యాం దిగువ భాగంలో రూ. 551 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం కేసీఆర్ అనుమతిస్తూ నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా డ్యాం మధ్యలో నాలుగు ఎకరాల్లో ఉన్న మైసమ్మగుట్టపై రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్ పేరు తో అత్యాధునిక హంగులతో టూరిస్టులను ఆకట్టుకునేలా పలు రకాల నిర్మాణాలు చేపట్టాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. మొదటి దశలో రూ.5 కోట్లు కేటాయించారు.

డ్యాం పరిసరాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి పట్టు
———————————————————————-

డ్యాంతోపాటు మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై సీఎం కేసీఆర్ ముందునుంచీ దృష్టిపెట్టారు. డ్యాంతోపాటు పరిసర ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి పట్టు ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇందు లో భాగంగానే డ్యాంకు దిగువన మానేరు రివర్ ఫ్రంట్‌ను రూ.551 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించి గత బడ్జెట్‌లోనే రూ. 350 కోట్లు కేటాయించారు. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. డ్యాం పరిసర ప్రాంతం లో సీఎం కేసీఆర్ ఐటీ టవర్ మంజూరు చేయ గా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఒకవైపు ఉజ్వల పార్కు, మరోవైపు డీర్ పార్కు ఉన్నాయి. మానేరు రివర్‌ఫ్రంట్ పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నది. ఈ పనులు సాగుతున్న తరుణంలోనే దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా తాజాగా కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటు
—————————————

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎల్‌ఎండీ ఏడాదిపొడవునా పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడనున్నది. దాంతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మైసమ్మగుట్టను మరింత రమణీయంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటకరంగానికి కేరాఫ్‌గా మార్చాలని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ భావించారు. ఆ మేర కు కరీంనగర్ సిటీ రెనోవేషన్‌లో భాగంగా మైసమ్మగుట్టపై కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే కొద్ది రోజుల కిం దట నిర్ణయించారు. ఈ విషయాన్ని గత అసెం బ్లీ వేదికగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రస్తావించారు. సాధ్యాసాధ్యాలపై, ఇండోనేషియా, బెంగళూరుకు చెందిన ఇన్ఫినిట్టూడ్ డిజైన్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి మైసమ్మగుట్టపై అత్యద్భుతమైన పర్యాటక కేంద్రా న్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాథమిక నివేదిక అందజేశారు. దీని అధారంగా ఎంపీ, ఎమ్మెల్యేలు పర్యాటకశాఖతో చర్చించారు. రాష్ట్రం లో ప్రాజెక్టు మధ్యలో గుట్ట ఉండి, నలువైపు లా నీళ్లున్న ప్రాంతం ఎక్కడా లేదన్న విషయా న్ని గుర్తించిన పర్యాటకశాఖ రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మాణాలు
—————————————————–
కేసీఆర్ ఐలాండ్‌ను ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. ప్రతి నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా అకట్టుకునేలా ఇప్పటికే ఇన్ఫినెట్యూడ్ డిజైన్ కంపెనీ తమ ప్రణాళికతోపాటు డిజైన్లు అందజేసింది. ఈ డిజైన్లను ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు వాటిని పర్యాటకశాఖకు అప్పగించారు.

కేసీఆర్ ఐలాండ్ విశేషాలు..
—————————————-

-ఆధునిక హంగులతో అత్యంత విశాలంగా ఎంట్రెన్స్ లాబీ.

-పూర్తిగా అద్దాలతో బాంకెట్ హాల్, మెడిటేషన్ హబ్, యూనెక్స్ పార్లర్, డబుల్‌కాట్ బెడ్స్‌తోపాటు ఆధునిక వసతులతో ఐదు ప్రీమియం సూట్స్.

-ఇండోనేషియా ఆర్కిటెక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు.

-40 మందికిపైగా విందు చేసుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ రెస్టారెంట్.

-క్యాండిల్‌లైట్ డిన్నర్, కాక్‌టెల్ పార్టీల కోసం నలుమూలలా ఫ్లోటింగ్ బ్రిడ్జీలు.

-సెవెన్‌స్టార్ హోటల్‌కు మించిన సదుపాయాలతో వీవీఐపీల కోసం గుట్టపైభాగంలో ప్రెసిడెన్షియల్ సూట్.

-పిల్లలు, పెద్దలకు వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్.

-రెండు ఎలివెటేడ్ బ్రిడ్జీలు.

-పర్యాటకులు వివిధ సూట్స్‌కు వెళ్లడానికి కావాల్సిన లిఫ్టులు.

ఏడాదిలో పూర్తిచేస్తాం
———————————-
కరీంనగర్ రెనోవేషన్ సిటీలో భాగంగా నిర్మించనున్న కేసీఆర్ ఐలాండ్‌ను ఏడాదిలోపు పూర్తిచేయడానికి కాం ట్రాక్టు సంస్థలు మాకు హామీ ఇచ్చా యి. ఇది పూర్తయితే దేశ, విదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తారు. యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్ల నుంచి రూ.3 కోట్లు కేటాయించాం. మరో రూ.2 కోట్లను పర్యాటకశాఖ కేటాయించింది. దశలవారీగా జరిగే నిర్మాణాలకు ముందుముందు కావాల్సిన నిధులను కేటాయిస్తాం. కేసీఆర్ ఐలాండ్ కరీంనగర్‌కే కాదు యావత్ తెలంగాణకు ఒక మణిహారంలా నిలువనున్నది.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే

పర్యాటకరంగానికే ఐకాన్‌గా నిలుస్తుంది
———————————————————

సాధారణంగా సముద్రాల్లో ఈ తరహా ఐలాండ్లను ఏర్పాటుచేస్తారు. అక్కడ ఎక్కువ రోజులు బస చేయలేం. కానీ ఎల్‌ఎండీ దీనికి పూర్తిగా భిన్నం. మంచి నీళ్ల మధ్య ఏర్పాటుచేసే ఈ పర్యాటక ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంటుందని భావిస్తున్నాం. ఎల్‌ఎండీలో ఉన్న గుట్ట మన రాష్ట్రంలో మరే ప్రాజెక్టులోనూ కనిపించదు. అందులోనూ నాలుగు ఎకరాల గుట్ట ఉండటం వల్ల ఆ స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మించే కేసీఆర్ ఐలాండ్ తెలంగాణ పర్యాటకరంగానికే ఒక ఐకాన్‌గా నిలుస్తుంది. దశలవారీగా పనులను పకడ్బందీగా చేస్తాం. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేసేలా నిర్మాణాలుంటాయి.

– మనోహర్‌రావు, ఎండీ, పర్యాటకశాఖ

About The Author