షామీ ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త…?


షామీ ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త..
శామ్ సంగ్ ఫోన్లతో తక్కువ రేడియేషన్..
—————————————-
స్మార్ట్‌ఫోన్‌లు రేడియేషన్‌ వెదజల్లుతాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అన్ని స్మార్ట్‌ఫోన్లు ఒకే స్థాయిలో రేడియేషన్‌ను వెలువర్చవు. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో రేడియేషన్‌ స్థాయి ఎక్కువగా ఉన్నది ఏ స్మార్ట్‌ఫోనో తెలుసా..? షామీ ఎంఐ ఏ1. అవునండి మిగతా వాటితో పోలిస్తే చైనాకు చెందిన షామీ, వన్‌ఫ్లస్‌ ఫోన్లే ఎక్కువ రేడియేషన్‌ను వెలువరుస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. కాగా.. దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగ్‌ ఫోన్లలో రేడియేషన్‌ స్థాయి తక్కువగా ఉన్నట్లు తెలిపింది.
జర్మన్‌ ఫెడరల్ ఆఫీస్‌ ఫర్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ ఇటీవల దీనిపై ఓ అధ్యయనం చేపట్టింది. ఈ సంస్థ అందించిన డేటాతో స్టాటిస్టా అనే డేటాబేస్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ల రేడియేషన్‌ స్థాయిపై జాబితాను రూపొందించి ప్రకటించింది. దీని ప్రకారం.. షామీ ఎంఐ ఏ1 అత్యధికంగా రేడియేషన్‌ వెదజల్లుతోంది. ఈ ఫోన్‌ రేడియేషన్‌ స్థాయి 1.74 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌గా ఉంది. ఆ తర్వాత 1.68 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌ రేటుతో వన్‌ప్లస్‌ 5టీ రెండో స్థానంలో ఉంది. షామీ ఎంఐ మాక్స్‌ 3 ఫోన్‌ కిలోగ్రామ్‌కు 1.58 వాట్స్‌ చొప్పున రేడియేషన్‌ను వెలువరుస్తున్నట్లు నివేదిక తెలిపింది.
అత్యధిక రేడియేషన్‌ స్థాయి ఉన్న తొలి 16 ఫోన్లలో 8 షామీ, వన్‌ప్లస్‌ బ్రాండ్‌లకు చెందినవే. యాపిల్‌కు చెందిన ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 8 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్‌ 7 రేడియేషన్‌ స్థాయి 1.38 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌గా ఉంది.
కాగా శామ్‌సంగ్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు తక్కువ రేడియేషన్‌ను వెలువరుస్తున్నట్లు నివేదిక పేర్కొంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 రేడియేషన్ స్థాయి 0.17 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌గా ఉంది. గెలాక్సీ ఏ8, ఎస్‌8 ప్లస్‌, ఎస్‌7 ఎడ్జ్‌, ఎస్‌9 ప్లస్‌, ఎస్‌8 ఫోన్ల రేడియేషన్‌ స్థాయి కూడా 1 వాట్‌ లోపే ఉన్నట్లు స్టాటిస్టా నివేదిక వెల్లడించింది.

About The Author