సమలత గారు ఉచితంగా అర్ద ఎకరా భూమి…
జమ్మూ, కాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన కర్ణాటకలోని మండ్య జిల్లా వీర జవాను గురు కుటుంబ సభ్యులకు ఉచితంగా అర్ద ఎకరా భూమి ఇవ్వడానికి దివంగత రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ ముందుకు వచ్చారు.
వీర జవాను గురు అంత్యక్రియకులు నిర్వహించడానికి సొంత భూమి లేక ఆయన కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారని తెలుసుకున్న సుమలత ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాను ఉచితంగా అర్ద ఎకరా భూమి ఇస్తున్నానని వీర జవాను గురు కుటుంబ సభ్యులు, మండ్య జిల్లాధికారులకు సమలత సమాచారం ఇస్తూ ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో ప్రభుత్వ భూమిలో వీర జవాను గురు అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ భూమిలో వీర జవాను గురు అంత్యక్రియలు నిర్వహించినా పర్వాలేదని, తాను మాత్రం అంబరీష్ జన్మస్థలం అయిన దొడ్డరసినకెరె ప్రాంతంలో ఉన్న అర్ద ఎకరా భూమిని ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.
తాను షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం మలేషియాలో ఉన్నానని, వీలైనంత త్వరగా మండ్య చేరుకుని వీర జవాను గురు కుటుంబ సభ్యుల పేరుతో అర్ద ఎకరా భూమిని రిజిస్టర్ చేయిస్తానని, మండ్య జిల్లా కోడలిగా అది తన కర్తవ్యం అని నటి సుమలత అంబరీష్ వివరణ ఇచ్చారు.
దివంగత అంబరీష్ కు మండ్య జిల్లా ధానకర్ణుడు అనే పేరు ఉంది. తన భర్త అడుగుజాడాల్లో నడవాలని నటి సుమలత నిర్ణయించారని వారి సన్నిహితులు అంటున్నారు.