కర్ణాటకలో మరో దేశద్రోహ టీచర్…!
కర్ణాటకలో మరో దేశద్రోహ టీచర్!
బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిపై దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఓ ఉపాధ్యాయురాలు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తన దేశద్రోహాన్ని చాటుకున్నారు. దేశ ద్రోహానికి సంబంధించిన సమాచారాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
పాకిస్తాన్ కీ జయహో అని కామెంట్ చేసి, దానికి చిరునవ్వులతో ఉండే ఎమోజీని ట్యాగ్ చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్, వాట్సప్ లల్లో దాన్నిపోస్ట్ చేశారు. అక్కడితో ఆగలేదు. తన వాట్సప్ డిస్ ప్లే లో కూడా ఆమె అదే ఇమేజ్‌ను ఉంచారు. ఆ ఉపాధ్యాయురాలి పేరు జిలీకా మమదాపుర. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకాలోని కడబి శివాపుర గ్రామానికి చెందిన యువతి ఆమె.
స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె పని చేస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆమె ఈ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ కు జై కొట్టడం మాత్రమే కాకుండా.. ఆ దేశ జాతీయ పతాకాన్నికూడా ఆమె ఇందులో ప్రదర్శించారు. రెండు రోజుల తరువాత ఈ సమాచారం బయటికి పొక్కింది. వాట్సప్ ల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడబి శివపుర గ్రామంలోని ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంటికి నిప్పు అంటించారు.
దీనితో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదుల సంఖ్యలో స్థానికులు ఆమె ఇంటి వద్ద గుమికూడి నినాదాలు చేశారు. ఆమెను గ్రామం విడిచి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే మురగూడ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. లాఠీ ఛార్జీ చేశారు. స్థానికులను చెల్లా చెదురు చేశారు. జిలీకాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంటికి నిప్పంటించిన వారిలో ఆరుమందిని అరెస్టు చేశారు.