నాగబాబు చెప్పిన ఆరు చేపల కథ…


ఏడు చేపల కథ అందరికీ తెలిసిందే. కానీ నాగబాబు మాత్రం ఆరుచేపల కథ చెబుతున్నారు. ఇక్కడ 6 చేపలంటే 6 ఆరోపణలు. ఆ ఆరు ఆరోపణలకు ఆయన ఆరుసార్లు స్పందించారు. ఎందుకలా ఆరుసార్లు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అయిపోయిన ఎపిసోడ్ ఎందుకయ్యా అంటూనే ఆరుచేపల కథను మరోసారి విపులంగా వినిపించారు మెగాబ్రదర్.

దెబ్బతిన్నవాడికి ఆ బాధేంటో తెలుస్తుందని, దెబ్బకొట్టినవాడు, కొడుతుండగా చూసినవాడు.. ఆ సంఘటనని మర్చిపోయినా బాధపడ్డవాడు మాత్రం దాన్ని అంతతేలిగ్గా మర్చిపోలేడని చెప్పారు నాగబాబు. 2010 నుంచి పలు సందర్భాల్లో బాలకృష్ణ అన్నమాటలు తనను బాధించాయని, ఒకట్రెండు సార్లు ఓపికపట్టినా.. 6సార్లు బాలయ్య తమ సహనాన్ని పరీక్షించాడని అందుకే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అన్నారు.

అయితే ఆ తర్వాత తప్పంతా మీడియా మీద నెట్టేశారు నాగబాబు. బాలకృష్ణ గురించి అడిగితే సరదా కోసం తెలియదని అన్నానని దాన్ని మీడియానే పెద్దది చేసిందని, అయ్యో ఆయన తెలియదా అంటూ రాగాలు తీసిందని అందుకే తాను ఓ సిరీస్ స్టార్ట్ చేసి మరీ మీడియాకు బదులిచ్చానని చెప్పారు నాగబాబు. కేవలం మీడియాకి ఆన్సర్ చేసేందుకే సిరీస్ స్టార్ట్ చేశానన్నారు.

ఒకటి కాదు, రెండుకాదు.. ఆరుసార్లు అదేపనిగా అంటుంటే ఎవరికైనా బాధ వేస్తుందని వివరణ ఇచ్చారు. కారణం లేకుండా మిమ్మల్ని పదే పదే కొడితే మీరు మాత్రం స్పందించకుండా ఉంటారా అంటూ సదరు యాంకర్ ని ప్రశ్నించారు నాగబాబు. 6 సార్లు తమని అన్నందుకు, 6 సార్లు బదులిచ్చేశానని, ఇక ఈ వివాదం ముగిసిపోయినట్టేనని సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు నాగబాబు.

About The Author