బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ ప్రొత్సాహం…

బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ ప్రొత్సాహం

• జాతీయ స్థాయిలో తన ఆవిష్కరణకు మూడో బహుమతి పొందిన అభిషేక్
• ధాన్యం బస్తాల్లోకి ఎత్తే యంత్రాన్ని కనుగొన్న అభిషేక్
• ధాన్యం ఎత్తేందుకు తన తల్లిదండ్రులు పడిన కష్టమే తనకు స్ఫూర్తి అన్న అభిషేక్
• బాలునికి లక్ష పదహారువేల ప్రొత్సాహకాన్ని అందించిన కేటిఆర్
• ఐఏఎస్ కావాలన్న అభిషేక్ ను తన ఖర్చులతో చదివిస్తానన్న కేటిఆర్
• స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా బాలునికి మరింత సహాకారం

ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు గారి ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ లో ప్రథమ బహుమతి రావడంతో పాటు జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించిందని తెలుసుకున్న కేటిఆర్, బాలున్ని ఈ రోజు బేగంపేట ప్రగతి భవన్ కు ఆహ్వానించారు.

ఢిల్లీలో బహుమతి అందుకున్న అభిషేక్ తన ఉపాద్యాయులతో నేరుగా కేటిఆర్ ను వచ్చి కలిసారు. ఇంత చిన్న వయసులో ధాన్యం ఎత్తే యంత్రాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష ఎలా మొదలైందని కేటిఆర్ బాలున్ని అడిగారు. తనది వ్యవసాయ కుటుంబం అని, తల్లితండ్రులు ధాన్యాన్ని ఎత్తేందుకు మరో నలుగురితో కలిసి పడుతున్న కష్టం తనకు ఈ పరికరాన్ని తయారుచేసేందుకు స్ఫూర్తిని కలిగించిందని అభిషేక్ తెలియజేశాడు. జాతీయ స్థాయిలో బహుమతి అందుకున్నందుకు అభిషేక్ కి అభినందనలు తెలియజేసిన కేటిఆర్, భవిష్యత్తులో ఏమవుతావు అని అడిగినప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష తనకు ఉన్నదని అభిషేక్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తానని కేటిఆర్ అభిషేక్ కు హామీ ఇచ్చారు.

అభిషేక్ తన యంత్రానికి పేటెంట్ పొందేందుకు, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు, తన ఆలోచనలను ముందుకు తీసుకుపోయేందుకు తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా కేటిఆర్ తెలియజేశారు. దీంతోపాటు తన తరపున ప్రోత్సాహకంగా లక్ష పదహారు వేల రూపాయాల చెక్కును అభిషేక్ కు అందించారు. ఈ సందర్భంగా అభిషేక్ వెంట ఉన్న హనుమాజీపేట స్కూల్ ఉపాధ్యాయులకు మాజీ మంత్రి అభినందనలు తెలియజేశారు

About The Author