ఆహార శుద్ధి మరియు విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారుల (DRDO) రాష్ట్ర స్థాయి సమావేశం…
18.02.2019 నాడు రాష్ట్రంలో ఆహార శుద్ధి మరియు విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారుల (DRDO) రాష్ట్ర స్థాయి సమావేశం సెర్ప్ సమావేశ మందిరంలో శ్రీ . సి.పార్థసారధి IAS, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి మరియు వ్యవసాయ ఉత్పత్తుల కమీషనర్, తెలంగాణ రాష్ట్రం వారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో సాగవుతున్నటువంటి వివిధ ఉద్యాన మరియు వ్యవసాయ పంటలు, వాటి విలువ ఆధార ఉత్పత్తులకు ఉన్నటువంటి అవకాశాలను వివరంగా చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు, పసుపు, మిరప, కూరగాయలు, మామిడి, సీతాఫలం, బత్తాయి లాంటి ఉద్యాన పంటలు మరియు మొక్కజొన్న, సోయచిక్కుడు, వేరుశెనగ, వివిధ చిరుధాన్యాల పంటలలో విలువ ఆధారిత ఉత్పత్తులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో వివరించారు.
ఈ సమావేశంలో శ్రీమతి పౌసమి బసు IAS,CEO, సెర్ప్ గారు మాట్లాడుతు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో మార్కెట్ అనుసంధానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దానిని తప్పనిసరిగా ప్రణాళికలో పొందుపరచాల్సిన ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యాన సంచాలకులు శ్రీ.ఎల్ వెంకట్రామ్ రెడ్డి గారు ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉద్యాన పంటల విలువ ఆధారిత ఉత్పత్తులకు ఉన్న అవకాశాలు, ముఖ్యంగా పసుపు మరియు మిరప పంటకు సంబంధించి పాటించాల్సిన అధునాతన సాగు పద్ధతులు, పంటలను గ్రేడింగ్ చేయవలసిన పద్ధతులు మరియు నాణ్యత ప్రమాణాలను కూలంకషంగా వివరించడం జరిగింది.
శ్రీ.సి.పార్థసారధి IAS, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి మరియు వ్యవసాయ ఉత్పత్తుల కమీషనర్ గారు ప్రసంగిస్తూ రైతులకు విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా రైతుల ఆదాయం మునుపటికన్నా పెరిగే విధంగా ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశించారు.ఈ ప్రణాళికలను మరింత సూక్ష్మంగా మదింపు చేయడానికి పంటల వారి నిపుణుల కమిటీ ద్వారా ఈ నెల 25వ తేదీ నుండి కార్యశాలలు (workshops) నిర్వహించవలసిందిగా ఆదేశించారు.
ఈ సమావేశంలో శ్రీమతి. పౌసమి బసు IAS,CEO, సెర్ప్ గారు, శ్రీ.ఎల్ వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర ఉద్యాన సంచాలకులు, రాష్ట్ర మార్కెటింగ్ సంచాలకులు శ్రీమతి జి లక్ష్మీబాయి గారు , ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా. ఎ. కిరణ్ గారు మరియు శ్రీ అఖిల్, డైరెక్టర్, ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ గారు పాల్గొన్నారు.