నైమిశారణ్యం…
నైమిశారణ్యం
శౌనకాది మహామునులు నైమిశారణ్యం వదలకుండా, అక్కడే ఉండడానికి కారణం ఏమిటి? నైమిశాఅరణ్యానికి ఆ పవిత్రత ఎలా వచ్చింది? ఈ సందేహాలకు సమాధానం మనకు “దేవీ భాగవతము”లో కనిపిస్తుంది. శ్రీ కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రవేశిస్తుందని గ్రహించిన శౌనకాది మహామునులు, కలిదోషానికి భయపడి, తరుణోపాయం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సత్యలోకం చేరారు. భక్తిగా బ్రహ్మదేవుని స్తుతించారు.
1. సంతసించిన భ్రహ్మదేవుడు “మహామునులారా! మీ భక్తిప్రవత్తులు నాకు సంతోషం కలిగించాయి. మీ కోరిక చెప్పండి తీరుస్తాను” అన్నాడు. అప్పుడు శౌనకుడు “పితామహా! పాపభూయిష్టమైన కలియుగం ప్రవేశించనుంది. ధర్మబ్రష్టులు, క్రూరకర్ములు, పాపాచారులు సంచరించే కలియుగం గురించి ఊహించాలంటేనే మాకు భయంగా ఉంది. కనుక, భూతలంపై కలిదోషం ప్రవేశించడానికి వీలులేని పవిత్రస్థలాన్ని నీవే మాకు చూపించాలి. మేమంతా ఆ పవిత్రక్షేత్రంలో దైవధ్యానంతో కలియుగాంతం వరకు కాలం గడుపుతాం. అనుగ్రహించు” అని ప్రార్థించాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పశక్తితో ఒక “మహామాయ చక్రాన్ని” సృష్టించి, వారితో “మహర్షులారా! ఈ చక్రాన్ని దోర్లిన్చుకుంటూ వెళ్ళండి. దేని ‘నేమి’ ఎక్కడ శిథిలమౌతుందో, ఆ ప్రదేశం కలిదోషం ప్రవేశించడానికి వీలులేని పరమపావన క్ష్ట్రమని గ్రహించండి” అని చెప్పి, ఆ చక్రాన్ని వారికిచ్చాడు.
2. శౌనకాది మహామునులు ఆ “చక్రాన్ని” దొరలించుకుంటూ వస్తున్నారు. ఒక ప్రదేశం వచ్చేసరికి ఆ చక్రం “నేమి” [ఇరుసు] శిథిలమైంది. “నేమి” శిథిలమైపడిన క్షేత్రం కనుకనే … అది “నిమిషక్షేత్రం” అయ్యింది. అదే “నైమిశారణ్యం” అదే శౌనకాది మహామునులకు నివాసక్షేత్రం. పశ హింసతో సంబంధం లేకుండా కేవలం పురోడాశాదులతోనే అక్కడ యజ్ఞాదులు నిర్వహించబడతాయి. దైవచింతన, తపో, యజ్ఞ, దాన్యాదులే, నైమిశారణ్యవాసుల నిత్యకృత్యాలు. శౌనకాదులకు పురాణగాథలు చెబుతున్నట్టుగానే, వ్యాసప్రోక్తమయిన పురాణగాథలను మానవజాతికి అందించాడు సూతమహర్షి. పురాణ ప్రవచనాలతో ప్రతిధ్వనించే పవిత్రక్షేత్రం “నైమిశారణ్యం”