మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు..అనుభవాలు..లీలలు…

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు..అనుభవాలు..లీలలు..
అన్నదానం..

2007 వ సంవత్సరం జూన్ నెల మొదటి వారం లో ఒకరోజు ఓ భక్తుడు 35 కిలోల బియ్యం తీసుకుని వచ్చి, ” దేవుడి వద్ద అన్నం వండి పెట్టాలని మొక్కుకున్నానయ్యా, కానీ నాకు వీలులేక చెయ్యలేకపోతున్నాను..ఈ బియ్యం ఇక్కడ ఇస్తున్నాను..మీరు ఉపయోగించండి ” అని చెప్పాడు..ఆరోజు వరకూ శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం ఒక విధాన పూర్వకంగా జరగడం లేదు..రాబోయే ఆదివారం రోజు నుంచి క్రమం తప్పకుండా అన్నదానం చేయడం ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన కలిగింది ..

అప్పటికి ఆలయం లో వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదు..చాలా తర్జన భర్జన తరువాత , మావద్ద కాపలాదారుడిగా ఉన్న ఆంజనేయులు కల్పించుకొని, “అయ్యా! గుడి తరఫున అన్నదానం మొదలుపెడదాము, శనివారం రాత్రికి, వచ్చిన భక్తులు ఇక్కడ ఏ వసతీ లేక ఇబ్బంది పడుతున్నారు..అలాగే, ఆదివారం మధ్యాహ్నం కూడా..” అన్నాడు..అర్చకులు, అర్చకేతర సిబ్బంది అందరూ ఈ సలహా బాగుంది అన్నారు..

ఇక, నిర్ణయం తీసుకోవడానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది..ఇంతమంది చెప్పిన తరువాత..ఆలయ సిబ్బంది సహకారమూ ఉన్న తరువాత.. ప్రక్కరోజు ఆదివారం నాడు ప్రయత్నం మొదలు పెడదామని అనుకున్నాము..మనసులో ఆలోచనంతా దానిని కొనసాగించడానికి నిధులెట్లా?అని..ఎందుకంటె, అన్నదానం ఏదో ఒకపూట చేసి ఆపడం కాదు..ప్రతి వారం కొనసాగించాలి..అదీ..శనివారం రాత్రి..ఒక్కొక్కసారి వేయి మంది భక్తులు వస్తుంటారు.. ఆదివారం మధ్యాహ్నం కూడా ఏడు వందల మందికి తగ్గరు..వంటవాళ్ళు , శుభ్రం చేసే పనివాళ్ళు, ఇలా ప్రతిదీ ఏర్పాటు చేసుకోవాలి..కానీ..మా అందరికీ ఉన్న ఒకే ఒక ధైర్యం..ఆ దిగంబర అవధూత దత్తాత్రేయ స్వామివారే! మనం ప్రారంభిద్దాము… తరువాత ఆ స్వామివారే చూసుకుంటారు అనుకున్నాము..

ఆరోజు సాయంత్రం మా దంపతుల మిద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద నిలబడి, “స్వామీ..ఈ క్షేత్రం లో అన్నదాన కార్యక్రమం నిరాఘాటంగా జరగాలని సంకల్పించాము..మా ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదించు తండ్రీ..” అని మనస్ఫూర్తిగా మ్రొక్కుకున్నాము..

అనుకున్న ఆదివారం వచ్చింది…ఆరోజు చిరు జల్లులు పడుతున్నాయి..మొట్టమొదట సలహా ఇచ్చిన ఆంజనేయులే ఆ పూట వంటకూడా చేసాడు..వాన కారణంగా పెద్దగా భక్తులూ రాలేదు..ఓ 150 మంది భోజన చేశారు..

సరిగ్గా మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఓ ముసలాయన, చేతిలో చిన్న సంచితో గుడికి వచ్చాడు..ఆయన శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత..”పెద్దాయనా..అన్నం తిని వెళ్ళు..” అని చెప్పాను..సరేనన్నట్లుగా తలవూపి వెళ్ళాడు..

భోజనం చేసి వచ్చి, “అన్నదానానికి చందా ఇస్తే తీసుకుంటారా?”అన్నాడు.. ఆయన్ని చూస్తే..”ఈయన చందా ఇస్తాడా?..” అనిపించింది..మహా అయితే ఓ యాభై రూపాయలు ఇస్తాడు.. సరే..పెద్దాయన..ఇస్తానంటున్నాడు..కాదనడం ఎందుకు అనుకున్నాము..

ఆయన తన పేరు పువ్వాడి కోటయ్య అనీ..కందుకూరు ప్రక్కన మహాదేవపురం గ్రామమనీ, వ్యవసాయం చేసుకుంటాననీ చెపుతూ..చేతి లోని సంచీలోంచి, 5000/- అక్షరాలా ఐదు వేల రూపాయలు తీసి ఇచ్చాడు..యాభై రూపాయలు కూడా ఇవ్వలేడేమో అనుకున్న మాకు..ఛెళ్ళున ఎవరో చెంప మీద కొట్టినట్టు అనిపించింది..దత్తాత్రేయుడు మాలోని అహంకారపు అజ్ఞానాన్ని ఇలా ఎత్తి చూపాడు..ఆ మొత్తంతో మరో రెండు వారాలు నిరాటంకంగా అన్నదానం జరపొచ్చు..(2007 నాటి ముచ్చట ఇది..ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఒక పూటకే..అంతకు నాలుగురెట్లు ఎక్కువగా ఖర్చు అవుతున్నది..) కోటయ్య కు రసీదు ఇచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకున్నాను..

ఆరోజు మొదలైన అన్నదాన కార్యక్రమం, ఈ నాటికీ నిర్విఘ్నంగా జరుగుతోంది..దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా, బడ్జెట్ లో కేటాయింపులు చేశారు..చేస్తున్నారు..ఇప్పుడు ప్రతి శనివారం రెండుపూటలా, ఆదివారం మధ్యాహ్నం కలిపి, సుమారు రెండువేల మందికి అన్నదానం జరుగుతోంది..మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజూ ఓ యాభై మందికి ఆహారం అందివ్వగలుగుతున్నాము..

శ్రీ స్వామివారి దయవల్ల దాతల సహకారంతో అన్నదానం చేయగలుగుతున్నాము..శని, ఆదివారాల్లో ఎంతమంది భక్తులు వచ్చినా..అందరికీ ఉచితంగా ఆహారం అందివ్వగలుగుతున్నాము..

దత్తదీక్షా కాలంలో ఆ 41 రోజులూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో ఉన్న దీక్షాధారులకు రెండుపూటలా ఉచితంగా ఆహారం అందిస్తున్నాము..

శ్రీ కోటయ్య ఆరోజు మాకిచ్చిన స్ఫూర్తి మేమెన్నడూ మరచిపోలేదు..

మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి మీవంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.

About The Author