టీడీపీ ముద్దు… సిట్టింగులు వద్దు… పతాక స్థాయిలో విశాఖ జిల్లా అసంతృప్త సెగలు…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ జిల్లా అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల మాట ఎలాగున్నా అధికార పార్టీ కుమ్ములాటలు పార్టీను రోడ్డున పడేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీనియర్ నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి దిగజారిపోయాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలాగున్నా విశాఖ దక్షిణం, గాజువాక, పాయకరావుపేట నియోజకవర్గాల్లో అధికార పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు. అనిత వద్దు టిడిపి ముద్దు అంటూ పాయకరావుపేటలో ప్రారంభమైన ఈ తిరుగుబాటు విశాఖ దక్షిణం, గాజువాక నియోజకవర్గాలకు పాకింది. పాయకరావు పేట ఎమ్మెల్యే అనితపై మొదటి నుండి సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. మధ్యలో కొన్ని రోజులు ఎమ్మెల్యే అనిత సయోధ్యతో పనిచేసిన ఎన్నికల సమీపిస్తున్న కొలది వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే నెలరోజుల క్రితం ఎమ్మెల్యే అనిత నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నాయకులే కొన్ని చోట్ల అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వెనక్కి తగ్గకపోవడంతో ఈ సారి ఏకంగా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. టిడిపి ముద్దు అనిత వద్దంటూ పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమెకు టిక్కెట్లు ఇస్తే ఓడిస్తామంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసారు. అంతేకాక మరో అడుగు ముందుకు వేసి, స్థానికంగా తమకు అందుబాటులో ఉండే డా|| బోని తాతారావుకు టిక్కెట్టు కేటాయిస్తే, రాష్ట్రంలో ఫలితాలు వెలువడే వేళ తొలి విజయం పాయకరావు పేటదే అవుతుంది అంటూ అధిష్టానానికి విజ్ఙప్తి చేస్తున్నారు
పాయకరావు పేటలో ప్రారంభమైన అసమ్మతి సెగలు విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని కూడా తాకాయి. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆ పార్టీకు చెందిన పలువురు మైనార్టీ, ఎస్సీ నాయకులు, మహిళా నాయకులు రోడ్డెక్కుతున్నారు. వాసుపల్లికి ఉన్న కళాశాల సిబ్బంది కనుసైగల్లో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాల్సి వస్తుందని మీడియా సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యేపై అసంతృప్తిని వెల్లబుచ్చారు. పార్టీలోని సీనియర్ నాయకులు ప్రక్కన పెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గంలో కళాశాల సిబ్బంది అవినీతి, అక్రమాలు ఎక్కువ అయిపోయాయని వీటిని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వాసులపల్లి తమపై సామ,దాన, దండోపాయలు ప్రయోగిస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో చాలా మంది నాయకుల పరిస్థితి ఇదేనని అయితే వాసుపల్లికి భయపడి చెప్పలేకపోతున్నారని అంటున్నారు. వాసుపల్లికి గాని మరోసారి టిక్కెట్టు ఇస్తే తామే స్వయంగా వ్యతిరేక ప్రచారం చేసి పార్టీను ఓడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
తలసరి ఆదాయంలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న గాజువాక నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పధకాలు చేపట్టడం ద్వారా నియోజకవర్గం ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష , వామపక్ష పార్టీల మాట ఎలాగున్న సాక్ష్యాత్తూ అధికార పార్టీ నాయకులే ఎమ్మెల్యేపై దుమ్మెత్తి పోస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ నాయకులు ఒకరిపై మరోకరు బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడటమే కాకుండా తన వర్గానికి చెందినవారికి తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో తాము మద్దత్తు ఇవ్వడం వలనే ఎమ్మెల్యే పళ్ళా శ్రీనివాసరావు గెలుపొందారని అయితే ఇప్పుడు తమను పురుగులను చూసినట్లు చూస్తున్నారని అంటున్నారు. మరోసారి పళ్ళాకు సీటు కేటాయిస్తే మేము కూడా టిడిపి వ్యతిరేకంగా ప్రచారం చేసి అతడ్ని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా రోజుకో నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రాజకుంటుండటంతో అధిష్టానం దీనిపై చర్యలు తీసుకుంటుందా లేక ద్వితీయ శ్రేణి నాయకులతో మనకేం పని అని ముందుకు పోతుందా అనేది వేచిచూడాల్సిందే.