మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో పర్యవేక్షణ…

గ్రామీణ ఉపాధిహమీపథకం, సెర్ఫ్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్షించారు పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులను ఆయన ఆదేశించారు.మార్చి 31 టార్గెట్గా తెలంగాణను బహిరంగా మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించేలా కృషిచేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు నిధులు సక్రమంగా వినియోగించుకునేలా దృష్టిసారించాలని సెర్ఫ్ అధికారులను కోరారు. నిధులు కేవలం వడ్డీలకు తిప్పటం వరకు మాత్రమే పరిమితం కాకుండా మహిళా గ్రూపులు వాటిని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తెలంగాణ వ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణపై సెర్ఫ్ సిబ్బంది దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా తన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో జాబ్మేళా ఏర్పాటుచేయాలని కోరారు. సెర్ఫ్లో అత్యంత కీలకమైన ఆసరా పించన్లపై కూడా చర్చించిన మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు 57ఏళ్ల నుంచి 64 ఏళ్ల లోపు ఉన్న కొత్త లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ వయసు పరిమితిలో 6 లక్షల మంది ఉన్నట్లు అధికారులు తెలపగా వారిని ఆసరా పించన్ల లబ్దిదారులుగా చేర్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల హామీమేరకు 1000 నుంచి 2016 రూపాయలకు, 1500 నుంచి 3016 రూపాయలకు పెరిగే పించన్ …అర్హులందరికీ అందేలా లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి వారిచే సక్రమంగా పనిచేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలని స్పష్టంచేశారు. తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లను సమీపంలోని కొత్త పంచాయతీల వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలని సూచించారు. లేబర్ బడ్జెట్ 13 కోట్లు చేరుకునేలా ఈజీఎస్ అధికారులు కృషిచేయాలన్నారు. ఉపాధిహామీ రోజు వారీ వేతనం ప్రభుత్వం నిర్ణయించింది 205 రూపాయలు కాగా గ్రామాల్లో కూలీలు147 రూపాలు కూడా పొందలేకపోతున్నారు వారు పూర్తి వేతనం పొందేలా పనులు జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీలకు నూతన గ్రామపంచాయతీల భవనాల నిర్మాణం ఉపాధిహామీ క్రింద చేపట్టాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ది నిధులు, డిపార్ట్మెంట్ నిధులు, ఈజీఎస్ నిధులు లింక్ చేసుకోని సద్వినియోగం చేసుకుంటూ కొత్త సర్పంచులను ఇన్వాల్వ్ చేస్తూ పూర్తిచేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం కనీసం అర ఎకరం లేదా వెయ్యి గజాలు భూమిని సేకరిస్తే వెంటనే నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. అటు స్మశాన వాటికలు లేని గ్రామాల్లో వాటికోసం భూసేకరణకు 2లక్షల రూపాయలు అందించేలా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రతీ గ్రామంలో పచ్చదనం పెంచేలా నాటే ప్రతీ మొక్కను కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. మొక్కలు నాటడం కాదు వాటిని బతికించేలా దృష్టిపెట్టాలి తద్వారా ఇంటింటా మొక్కలతో గ్రామాల్లో పచ్చదనం నింపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం నెరవేరాలని కోరారు. అటు ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో 60శాతం ట్రైబల్ వెల్ఫెర్ ఫండ్ , 20 శాతం స్త్రీనిధి నిధులు, 10 శాతం సెల్ఫ్ హెల్ఫ్ ఫండ్ మిగిలిన పది శాతం నిధులు లబ్ధిదారులు భరించేలా గోడౌన్స్ నిర్మాణం చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. వీటితో పాటు గ్రామాల్లో పాఠశాలల్లో వంటగదులు, మూత్రశాలలు ..పొలాల్లో నీటికుంట నిర్మాణం తద్వారా భూగర్జ జలాలల పెంపు, గ్రామ సంతల నిర్మాణాలు టార్గెట్ మేరకు సకాలంలో పూర్తిచేసి పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలను అభివృద్దిదిశగా ముందుకు తీసుకెళ్లాలని అధికారలును ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమీషన్ నీతు కుమారీ ప్రసాద్ లతోపాటు సెర్ఫ్, ఈజీఎస్, స్వచ్చభారత్ మిషన్ అధికారులు పాల్గొన్నారు.

About The Author