కేబుల్ టీవీ కష్టాలు మొదలు…


నచ్చిన ఛానెల్ ను మాత్రమే చూడండి. చూసిన దానికి మాత్రమే బిల్లు కట్టండి. ఇది మొన్నటివరకు ఊదరగొట్టిన డీటీహెచ్ హంగామా. దీనికి ట్రాయ్, కేంద్రప్రభుత్వం కూడా వత్తాసు పలకడంతో సరికొత్త నిలువుదోపిడీకి రంగం సిద్ధమైంది. నిజానికి గత నెలలోనే ఈ పథకం అమలు కావాలి. కానీ గడువును మరో నెలరోజులు పొడిగించారు. అది కూడా నిన్నటితో పూర్తయింది. ఫలితంగా నిన్నట్నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా ఇళ్లల్లో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. సరికొత్త ప్లాన్స్ అమల్లోకి వచ్చాయి.

నచ్చిన ఛానెల్ కు మాత్రమే డబ్లు చెల్లించండంటూ పైకి చెప్పి వినియోగదారుడి జేబుకు చిల్లు వేసే కార్పొరేట్ బృహత్తర మాయాజాలం ఇవాళ్టి నుంచి మొదలుకాబోతోంది. మీకు నచ్చిన ఛానెల్ నే ఎంచుకోండి, కానీ బేసిక్ ప్లాన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలనేది నిబంధనగా మారింది. బేసిక్ ప్లాన్ కు నచ్చిన ఛానెళ్ల రుసుము కూడా కలిపితే లెక్క 300 రూపాయలు దాటిపోతోంది.

మొన్నటివరకు ఈ ఛానెళ్లన్నీ 200 రూపాయల్లోనే వచ్చేవి. ఇప్పుడీ కొత్త నిబంధనతో ప్రతి వినియోగదారుడు అదనంగా 100 రూపాయలు చెల్లించాల్సిందే. కార్పొరేట్ కంపెనీలకు కోటాను కోట్ల రూపాయల లాభం చేకూర్చే పథకమిది. మొన్నటివరకు యాడ్స్ రూపంలో కోట్లు గడించిన ఈ కార్పొరేట్ ఛానెళ్లన్నీ ఆ యాడ్స్ తో పాటు ఇప్పుడు వినియోగదారుడి నుంచి కూడా నేరుగా డబ్బులు వసూలు చేయబోతోందన్నమాట.

ఉదాహరణకు ఏదైనా డీటీహెచ్ లో 150 రూపాయల రీచార్జ్ చేసుకుంటే ఉన్నంతలో తెలుగు టీవీ ప్రేక్షకుడికి అవసరమైన ఛానెళ్లన్నీ వచ్చేవి. కానీ తాజాగా విధించిన నియమాల వల్ల అవే ఛానెళ్లు పొందాలంటే ఇప్పుడు కనీసం 230 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బేసిక్ ప్యాక్ (దీన్ని 130 నుంచి 150 మధ్య ఆపరేటర్లు ఫిక్స్ చేశారు) కాకుండా ఏ ఛానెల్ కావాలన్నా అదనంగా చెల్లించుకోవాలన్నమాట.

తెలుగు బుల్లితెర వీక్షకులు రెగ్యులర్ గా చూసే ఈటీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు.. ఇలా ఏ ఛానెల్ ఇప్పుడు బేసిక్ ప్యాకేజీలో ఉండదు. కనీసం వాటి అనుబంధ ఛానెల్స్ కూడా ఉచితంగా రావు. ఇవన్నీ కావాలంటే 150కి అదనంగా కనీసం 120 రూపాయలు చెల్లించాలి. అంటే ఇప్పటివరకు నెలకు 150 చెల్లిస్తే, ఇకపై జీఎస్టీతో కలుపుకొని 300 రూపాయల వరకు బిల్లు వస్తుందన్నమాట.

ఇప్పుడు టీవీలో ఏ ఛానెల్ పెట్టినా కామన్ గా ఓ యాడ్ కనిపిస్తుంది. మా ఛానెల్స్ అన్నీ 27 రూపాయలే అని ఒకరు చెబుతారు. మా నెట్ వర్క్ లో 10 ఛానెల్స్ 40 రూపాయలే అని మరొకరు చెబుతారు. ఇంకొకరేమో ప్యాక్ మొత్తం 24 రూపాయలే అంటారు. విడివిడిగా చూస్తే ఇవన్నీ చవకగానే కనిపిస్తాయి.

కానీ బేసిక్ ప్యాక్ కు ఇవన్నీ కలుపుతూపోతే బిల్లు 300 దాటిపోతుంది. ఇంకాస్త ఆశపడి ఇంగ్లిష్ మూవీస్, క్రికెట్, మ్యూజిక్ లాంటివి కూడా సెలక్ట్ చేసుకున్నామంటే నెలకు 400 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఇవన్నీ మొన్నటివరకు 200 రూపాయలకే లభించేవి.

మొన్నటికి మొన్న నాణ్యత పేరిట సెట్ టాప్ బాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టి వినియోగదారుడ్ని నిలువునా ముంచారు. వెయ్యి నుంచి 2 వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేశారు. ఇప్పుడేమో నచ్చిన ఛానెల్ కు మాత్రమే డబ్బులు కట్టండంటూ మరో మోసానికి తెరతీశాయి ఈ కార్పొరేట్ కంపెనీలు.

About The Author