యాసంగి కొనుగోళ్లకు… సర్వం సిద్ధం…
ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ వచ్చిన తరువాత సాగునీటి రాకతో సాగుతో పాటు
ధాన్యం దిగుబడి కూడా పెరిగిందని, దానికి అనుగుణంగా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అధికారునులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్, శాఖ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ వ్యవహారం లక్షలాది మంది రైతుల వ్యయ ప్రయాసలతో కూడిన అంశం అయినందున జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, దాంతో ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోందని అన్నారు. రైతులు ఈ ఏడాది యాసంగిలో 9 లక్షల హెక్టార్లలో వరి పంటలు చేశారని, దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని, ఇందులో పౌరసరఫరాల సంస్థ ద్వారా 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ 2017-18లో ఖరీఫ్‌లో 18.27 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 35.81 లక్షల మెట్రిక్ టన్నులు, మొత్తం 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొలుగోలు చేసిందని కమీషనర్ అకున్ సబర్వాల్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఏడాది 2018-19కి గానుఒక్క ఖరీఫ్‌లోనే 40.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు.
ఈ సంధర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన
రైతులు వాటిని విక్రయించేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గోనె సంచులు, తేమకొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు, ప్యాడి క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు,
తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు కల్పించాలని, స్టోరేజ్ స్పేస్, రవాణా, సీఎంఆర్ కేటాయింపులపై ప్రధానంగా దృష్టిసారించాలని మంత్రిగారు అధికారులను ఆదేశించారు. రబీ కార్యాచరణకు సంబంధించి త్వరలో హైదరాబాద్‌లో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు త్వరలోనే పౌరసరఫరాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని అన్నారు.