ఎన్నికలకు సిద్దం కండి…అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా..
ఎన్నికలకు సిద్దం కండి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మధ్యనిషేధ, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో రానున్నందున ప్రతి ఒక్కరూ సంసిద్దంగా ఉండాలని రాష్ట్ర మద్య నిషేదము, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. విధి నిర్వహణలో మరింత వేగాన్ని గడించే క్రమంలో నూతనంగా రూపొందించుకున్న సాంకేతిక విధానాలను ప్రతి ఒక్కరూ అకళింపు చేసుకోవాలని, ఇందుకు చాలా తక్కువ సమయం ఉందని స్పష్టం చేసారు. రానున్న ఎన్నికల నేపధ్యంలో శుక్రవారం విజయవాడ ప్రసాదంపాడులోని అబ్కారీ కమీషనరేట్‌లో వివిధ జిల్లాల డిప్యూటి కమీషనర్‌లు, అసిస్టెంట్ కమీషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్‌లతో కమీషనర్ ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్‌తో సహా అదనపు కమీషనర్ కెఎల్ భాస్కర్ , జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ నాయిడు, దేవకుమర్, జోసఫ్, ఓఎస్డి నాగేశ్వరరావు, డిప్యూటీ కమీషనర్ – కంప్యూటర్స్ రేణుక తదితరులు ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించగా, ప్రత్యేకించి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించవలసి ఉందని మీనా పేర్కొన్నారు.
జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, తప్పని సరిగా ఒక అధికారి బాధ్యతాయుతమైన పాత్రను పోషించవలసి ఉంటుందని కమీషనర్ స్పష్టం చేసారు. అబ్కారీ విధానాలకు సంబంధించి ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పూర్తి స్ధాయిలో విచారించాలని, నిర్ణీత సమయంలో లోపు విచారణ నివేదికను రాకపోతే సంబంధిత డిప్యూటీ కమీషనర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. సాంకేతికతను పూర్తి స్దాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తగిన శిక్షణను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి ఎస్‌హెచ్ఓ నుండి ఒకరికి కేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇస్తామని, అది నేరుగా ఎస్‌హెఛ్ఓనే అయితే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఎప్పటి కప్పడు అవసరమైన సమాచారం రాష్ట్ర కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి కాలపరిమితి తప్పనిసరని, ఎటువంటి ఫిర్యాదు అయినా 48గంటల వ్యవధిలో పరిష్కారం కావలసిందేనని మీనా పేర్కొన్నారు.రోజువారి నివేదికలలో సైతం మరింత స్పష్టత ఉండేలా పలు మార్పులు చేసారు. రాష్ట్ర స్ధాయిలో అన్ని అంశాలతో కూడిన ఏకీకృత నివేదికతో పాటు, జిల్లాస్ధాయిలో కూడా అదేతీరుగా ఒక నివేదిక తయారు కావాలన్నారు. బెల్టు షాపులు, ఐడి పార్టీల దాడులు, మొబైల్ పార్టీ పనితీరు వంటి అంశాలపై కూడా రోజువారి నివేదికలు అవసరమని, మరోవైపు ఎన్నికల సంఘం కోరిన ఫార్మెట్లో నివేదికలు ఉండాలని మీనా పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్ మాట్లాడుతూ రానున్నది ఎన్నికల సమయం కాగా, సిబ్బంది పూర్తి స్ధాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సమయంలో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిగణించాలన్నారు. కేవలం ఎన్నికల ఫిర్యాదుల కోసమే రాష్ట్ర స్ధాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి, పూర్తి స్ధాయి సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ కంట్రోల్ రూమ్‌కు జవసత్వాలు కల్పిస్తామన్నారు. నేరాలకు సంబంధించి జిల్లాల మధ్య పోలికను చూపుతూ సమాచారం సిద్దం కావాలన్నారు. సగటు ప్రజలు ఎవరైనా మద్యం విక్రయాలకు సంబంధించి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. సాధారణ రాత పూర్వక ఫిర్యాదుతో పాటు ఈ మెయిల్, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్, వెబ్, తపాళా తదితర ఏవిధానంలోనైనా తాము ఫిర్యాదు స్వీకరించి తీసుకున్న చర్యలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదు అందిన తదుపరి తక్షణమే గంటల వ్యవధిలో స్పందించేలా తమ ప్రణాళిక సిద్దం చేసామన్నారు.
జారీ చేసిన వారు: ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ