సి.సి.ఐ. బ్రాంచ్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్…

వ్యవసాయ మరియు సహకార శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి IASగారు పత్తి, కందుల మ‌రియు ఇత‌ర వ్య‌వ‌సాయోత్ప‌త్తుల కొనుగోళ్లపై జిల్లా సంయుక్త పాల‌నాధికారులు, జిల్లా మార్కెటింగ్, మార్క్ఫెడ్, గిడ్డంగులశాఖ‌ మరియు సి.సి.ఐ. బ్రాంచ్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2018-19 సంవత్సరమున కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ.) వారు ఇప్పటివరకు రూ. 1935.47 కోట్ల విలువైన 3,57,821 మెట్రిక్ టన్నుల పత్తిని 1,35,862 మంది రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు 205 జిన్నింగ్ మిల్స్ మరియు 27 మార్కెట్ యార్డ్స్ ద్వారా కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీమతి జి.లక్ష్మీబాయి గారు తెలిపారు. ఇప్పటివరకు రైతులకు రూ. 1900.62 కోట్లు చెల్లించినట్లు తెలియజేయడమైనది.

అదేవిధంగా, 2018-19 సంత్సరమున 130 కేంద్రాల ద్వారా 88,006 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయడమైనదని మార్క్ఫెడ్ ఎం.డి. వి. భాస్కరాచారి గారు తెలిపారు. వీటి విలువ రూ. 499.44 కోట్లు. ఇప్పటివరకు రైతులకు రూ. 241.35 కోట్లు చెల్లించినట్లు తెలియజేయడమైనది.

ఈ సమావేశంలో ఆయా జిల్లా మార్కెటింగ్ అధికారులు, సి.సి.ఐ. అధికారులు మరియు మార్క్ఫెడ్ అధికారులతో సమీక్షించి ఈ క్రింది ఆదేశాలు జారీ చేయడమైనది:-

• రాష్ట్రంలో పత్తి సీజ‌న్‌ ముగింపు దశకు చేరుకుంటునందున తగిన జాగ్రత్తలు తీసుకొనవలసినదిగా ఆదేశించడమైనది. రైతుల ముసుగులో దళారులు చేరకుండా చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించడమైనది.
• రైతులకు చెల్లింపుల విషయములో ఆదిలాబాద్ బ్రాంచి కొనుగోలు మొత్తము రైతులకు చెల్లించగా, మహబూబ్ నగర్ మరియు వరంగల్ బ్రాంచీలు ఇంకను రూ. 34.85 కోట్లు చెల్లించవలసి ఉన్నది. వీటిని 2 రోజులలో చెల్లించవలసినదిగా ఆదేశించడమైనది.
• పత్తి కొనుగోలు కేంద్రములు మూసివేయుటకుముందు రైతుల వద్ద పత్తి లేదని నిర్దారించుకొని ఆయా సంయక్త కలెక్టర్ల దృష్టికి తీసుకొని వెళ్ళవలసినదిగా ఆదేశించడమైనది.

కందులు:-
• కేంద్ర ప్ర‌భుత్వం 70,300 మెట్రిక్ ట‌న్నుల కందుల కొనుగోళ్లకు అనుమ‌తించ‌డ‌మైన‌ది. అయిన‌ప్ప‌టికీ, జిల్లాల్లోని రైతుల కోరిక మేర‌కు అద‌నంగా 30,000 మెట్రిక్ ట‌న్నులతో క‌లిపి మొత్తం 1.00 ల‌క్ష మెట్రిక్ ట‌న్నుల కందుల కొనుగోళ్ల‌కై రాష్ట్ర ప్ర‌భుత్వం మార్క్‌ఫెడ్ మ‌రియు హాకా అధికారుల‌ను ఆదేశించ‌డ‌మైన‌ది.
• ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 88,006 మెట్రిక్ ట‌న్నుల కందులు కొనుగోలు చేయ‌గా, మిగ‌తా 12,294 మెట్రిక్ ట‌న్నుల కందుల కొనుగోళ్ల‌కై అవ‌స‌రమున్న రైతుల వ‌ద్ద నుండి కొనుగోలు చేసేవిధంగా జిల్లా మార్క్ఫెడ్ అధికారులు మ‌రియు జిల్లా సంయుక్త పాల‌నాధికారుల‌కు ఆదేశాలు జారీ చేయ‌డమైన‌ది.
• ముఖ్యంగా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన కందులను వెంట‌నే గోదాముల‌కు త‌ర‌లించి వాటికి సంబంధించిన బిల్లుల‌ను మార్క్ఫెడ్ ప్ర‌ధాన కార్యాల‌యానికి పంపాల్సిందిగా మ‌రియు రైతుల‌కు వెంట‌నే డబ్బులు చెల్లించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా మార్క్ఫెడ్ అధికారుల‌ను ఆదేశించ‌డ‌మైన‌ది.
• కందుల కొనుగోళ్లలో గతంలో జరిగిన పొరపాట్లు మరల జరగకుండా రైతుల ముసుగులో ఇతరులు కందులు అమ్మకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడమైనది.

శ‌న‌గ‌లు:-
• 2018-19 సంవ‌త్స‌ర‌మునకు గాను కేంద్ర ప్ర‌భుత్వం 34,500 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు కొనుగోలుకై ఆదేశించ‌డమైన‌ది. ఈ మేర‌కు మార్క్ఫెడ్ వారు రాష్ట్రంలో 38 కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మైన‌ది. ఇప్ప‌టివ‌ర‌కు 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,638 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు కొనుగోలు చేయ‌డ‌మైన‌ది. వాటి విలువ రూ. 7.57 కోట్లు.మిగ‌తా కొనుగోలు కేంద్రాల‌ను రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించే విధంగా ప్రారంభించాల‌ని జిల్లా మార్క్ఫెడ్ అధికారుల‌ను ఆదేశించ‌డ‌మైన‌ది.

About The Author