ఏప్రిల్ నెలాఖరులోపు 4 పంప్ హౌస్ లు పూర్తి చేయాలి
ఏప్రిల్ నెలాఖరులోపు 4 పంప్ హౌస్ లు పూర్తి చేయాలి
– కాల్వల భూ సేకరణకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి
– రంగనాయక సాగర్ ప్రాజెక్టు, టన్నెల్ పంప్ హౌస్ పనులు పరిశీలన.
ఇది చరిత్రలో నిలిచిపోయే పని.! చిర కాలం గుర్తుండి పోయేలా.. ప్రజలకు గొప్ప సేవ చేస్తున్నాం.! కాల్వల నిర్మాణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు.
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 10వ ప్యాకేజీ రంగనాయక రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనుల పురోగతి పై శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం జరిపి, ఆ తర్వాత రిజర్వాయరు చుట్టు 8కిలో మీటర్ల వరకూ కలియ తిరిగి క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం టన్నెల్ లోని పంప్ హౌస్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకు ముందు జరిగిన సమీక్షలో, పరిశీలనలో అక్కడికక్కడే పనుల పురోగతి పై ఆరా తీస్తూ..అధికారులకు సూచిస్తూ.. రాతి కట్టడం పని, డెలివరీ సిస్టమ్ పనులు నెలలోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఏప్రిల్ నెలలోపు 4 పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా ఎడమ, కుడి కాలువలు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మైనర్ కెనాల్స్ కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సహకరించాలని, ఈ భూ సేకరణ పనులన్నీ జూన్ నెలాఖరులోపు కావాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూ సేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వాయరు పనుల్లో వేగం పెంచాలని, రానున్న రెండు, మూడు నెలల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణను రూపొందించుకుని, ఆ లక్ష్యం దిశగా పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులుగా.. ప్రజలకు గొప్ప సేవే చేసే అవకాశం వచ్చిందని భావించి, దీనిని ఓ అదృష్టంగా భావిస్తూ.. చరిత్రలో నిలిచిపోయేలా పనుల వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు అధికారులకు, ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. మైనర్ ఇరిగేషన్ లో భాగంగా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు, ఒర్రెలు, వాగులు, వంకలన్నీ నింపితే.. ఆ పల్లె ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేసినవారమవుతామని, ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.