దిగుబడి పెరిగె.. ధర తగ్గె


దిగుబడి పెరిగె.. ధర తగ్గె

మహారాష్ట్ర, తెలంగాణల్లో పెరిగిన పసుపు సాగు
కొత్త వంగడాలతో దేశ వ్యాప్తంగా అధిక దిగుబడులు
తమిళనాడు కన్నా ఇక్కడ ధర తక్కువ

పసుపు.. రైతుల తలరాతను మార్చే ఖరీదైన వాణిజ్య పంటగా మారింది. ధర ఏమాత్రం తగ్గినా నష్టాలు అధికంగా చుట్టుముడుతున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత ఖరీదైన పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించే విధానం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. పంటను ఎంత ధరకు వ్యాపారులు కొనాలనేది కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వ్యాపారుల, దళారుల దయ.. రైతుల ప్రాప్తం అన్నట్లుగా పసుపు మార్కెట్‌ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది పసుపు పంట సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగినందున ప్రస్తుతం పంట ధర అంతంతమాత్రంగా ఉంది. తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలోనూ సాగు, దిగుబడి పెరగడం వల్ల ఇక్కడి మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పంటకు ధర లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలకు దిగిన నేపథ్యంలో మార్కెట్‌ ధరలపై అధ్యయనం చేసింది.

ఇందులో ముఖ్యాంశాలు:

* ప్రస్తుత ఏడాదిలో దేశవ్యాప్తంగా 11.49 లక్షల టన్నుల పసుపు పంట దిగుబడి వస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. గతేడాది వచ్చిన దానికన్నా ఇది 16 వేల టన్నులు అధికం.

* తెలంగాణలో గతేడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఈసారి 1.35 లక్షల ఎకరాల్లో వేశారు. 2.84 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.

* ఈ నెల 1 నుంచి 22 వరకూ నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌ ధరపై మార్కెటింగ్‌ శాఖ నివేదించింది. కనిష్ఠంగా క్వింటాకు రూ.4 వేల నుంచి గరిష్ఠంగా రూ.6718 వరకూ ధర రైతులకు అందింది. కానీ తమకు రూ.5 వేలలోపే ఇస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

* గతేడాది ఇదే సమయంలో ఇప్పటికన్నా రూ.వెయ్యి వరకూ ధర ఎక్కువగా ఉంది. ఈసారి పక్కనున్న మహారాష్ట్రలో సాగు, దిగుబడి పెరగడంతో ఇక్కడ డిమాండు పడిపోయింది.

* తమిళనాడులోని ఈరోడ్‌ మార్కెట్‌ దేశవ్యాప్తంగా పసుపు వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రస్తుతం అక్కడ క్వింటా ధర రూ.5500 నుంచి 7200 దాకా ఉంది.

* తెలంగాణ మార్కెట్లకు వస్తున్న పంటలో తేమ ఎక్కువగా ఉంటోందని ధర తగ్గిస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. పంటను ఆరబెట్టి తెస్తే ధర పెరుగుతుందని రైతులకు చెబుతున్నట్లు మార్కెటింగ్‌ శాఖ వివరించింది.

* ఎకరా పసుపు సాగుకు రూ.80 వేల నుంచి లక్ష వరకూ పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. కానీ ఖర్చులు పోతే ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు.

* ఈ నెలలో 22 వరకూ సెలవులు పోను 13 రోజులు నిజామాబాద్‌ మార్కెట్‌లో కొనుగోలు జరగ్గా 1.25 లక్షల క్వింటాళ్ల పంట అమ్మకానికి వచ్చింది. వాస్తవానికి వచ్చే నెలలో మరింత ఎక్కువగా మార్కెట్లకు పసుపు వస్తుంది. ప్రస్తుతం ధర లేనందున వచ్చే నెలలో మరింత దిగజారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

• ముందస్తు ఏర్పాట్లు విఫలం

రాష్ట్రంలో పసుపు సాగు, మార్కెటింగ్‌ విషయాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ధర తగ్గడానికి ప్రధాన కారణం. పసుపు సాగు, దిగుబడి పెంచడానికి ఉద్యానశాఖ గత రెండేళ్లుగా పెద్దఎత్తున చర్యలు తీసుకుంది. తమిళనాడు, కేరళ, బిహార్‌లలో అధిక దిగుబడి వస్తున్న వంగడాలను తెప్పించి రైతులకు ఇచ్చింది. దీనివల్ల దిగుబడి 30 నుంచి 34 శాతం వరకూ పెరిగినట్లు మార్కెటింగ్‌ శాఖ వివరించింది. పంట సాగు పెంచే సమయంలోనే అధిక దిగుబడి వస్తే కొనుగోలు ఎలా అనే ముందస్తు ప్రణాళిక, చర్యలు లేకపోవడంతో ఇప్పుడు వ్యాపారులు రైతులను దెబ్బతీస్తున్నారని ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు.

About The Author