వామాచారం పూజా పద్ధతులు…
హిందూ నమ్మకాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి దక్షిణాచారం మరియు వామాచారం అనే తాంత్రిక మార్గాలుంటాయి. ఇందులో వామాచారం అనేది దేవతలను మరియు మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునే అతి సులువైన తాంత్రిక మార్గం. దీన్ని తమో గుణం ఉన్నవారు ఆచరిస్తారు. అఘోరాలు దీనికి
ఉదాహరణ.వామాచారానికి మద్య, మాంస, మత్స్య, ముద్ర, మరియు మైథునం అనే పంచ మకారాల(లేక పంచ తత్వాలు) తో సంబంధముంది. మద్యము అనగా పులియపెట్టిన ద్రాక్ష రసం (వైన్). దీన్ని అమృతంతో పోల్చవచ్చు. ముద్ర అనగా యోగ ముద్ర. మైథునం అనగా సంభోగించడం. వామాచారం తంత్ర మార్గంలో వామా దేవిని ప్రసన్నం చేసుకోవటానికి మాంసం భుజించి, మద్యం సేవించి, వామాదేవి విగ్రహం ఎదురుగా కన్నెపిల్లలతో సంభోగిస్తారు వామాచార తాంత్రికులు.
వేద విహితమైన మార్గాల ద్వారాగాక, అడ్డదారులలో సిద్ధశక్తులను సంపాదించడానికి అనుసరించే పూజా విధానం వామాచారమని పేరుతెచ్చుకొన్నది. సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరూ, పంచమకారాల ఆకర్షణ వల్ల మరికొందరూ వామాచార మార్గం పట్టారని ఒక భావన. వామాచారం ఐదు విధాలని మేరుతంత్రమనే గ్రంథం తెలియజేస్తున్నది. కౌలం/ కౌళం, వామం, చీనం/ చీనక్రమం, సిద్ధాంతం, శాబరం. (కౌలికోంగుష్ఠతాం ప్రాప్తో వామస్యాత్ తర్జనీ నమః చీనక్రమో మధ్యమస్యాత్ సిద్ధాన్తీయో వరోభవేత్.) కౌళం మొదటి వామాచార మార్గం. తరువాతది వామం. మూడవ దానిని చీన క్రమం అన్నారు. తిరిగి చీన క్రమం మూడు విధాలు. చీన, మహాచీన, దివ్యచీన అని వీటికి పేర్లు. ఇది చైనా నుంచిగానీ, టిబెట్ నుంచి గానీ వచ్చిన వామాచారమై ఉండ వచ్చునని అంటారు.
నాలుగవది సిద్ధాంతం. ఐదవది శాబరం. చివరిదానికి ఆటవికులలో ఆదరణ ఎక్కువ. ఇందులో మద్యపానం ఉంది, జంతు బలి ఉంది. కౌలం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తూ, రాత్రివేళ వామాచార పూజలు చేస్తుంటారని అంటారు. కుల సంబంధమైనది గనుక కౌలం అని ఒక నిర్వచనం. తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వల్ల కూడా కౌలం అనే పేరు స్థిరపడి ఉండవచ్చు. పంచ‘మ’కారాలు అంటే- మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శెనగలు అని అర్థం. మిగతావి తెలిసినవే. మనస్సు సాధారణంగా దేనివల్ల తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తికలిగిస్తుందని వామాచార పరుల భావన. బలులు ఇవ్వడం, తాగిన మైకంలో వివస్త్రను అనుభవించడం లాంటివి ఈ పూజలలో భాగమని అంటారు. మేరు తంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్య భావం అనే దశలు ఉన్నాయి.
సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి, ‘‘సోహం’’ భావన దశ చేరుకొంటాడని ఆంతర్యం. సోహం భావన అంటే తానే బ్రహ్మననే జ్ఞానం కలగడం. పశుభావంలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి కలిగినప్పుడు గానీ వీరభావ దశ రాదు. అప్పుడైనా గురువు అవసరం కలుగుతుంది. తరువాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది. కాని, సాధనలో దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామా చారాన్ని ఖండిస్తాయి.