పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్‌… నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఐఎస్‌ఐ..

* క్వెట్టాలో ప్రత్యేకంగా ప్రెస్‌ ఏర్పాటు

* బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు తరలింపు

* పశ్చిమబెంగాల్‌లోని మాల్దా నుంచి సరఫరా

భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్‌ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్‌లోని బలూచిస్తాన్‌ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్‌ పవర్‌ ప్రెస్‌’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్‌ఐ కాపీ చేయలేకపోయింది.

రూటు మార్చి భారత్‌కు..
క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్‌ఐ ప్రత్యేక పార్సిల్స్‌ ద్వారా పలు మార్గాల్లో భారత్‌కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్‌ నుంచి విమానాల ద్వారా దుబాయ్‌/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్‌ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది.

క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్‌
కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్‌ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్‌ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్‌ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్‌ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి.

About The Author