ఏడుగురు అభ్యర్థులు…ఒకే పార్టీ నుంచి ఒకే నియోజకవర్గం..
రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో పుట్టి రాజకీయంగా చాలా మంది నేతలు ఎదుగుతున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు ఒకే పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు పొంది
సార్వత్రిక ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఐదుగురు నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఇద్దరు గుంటూరు జిల్లాలోనే రెండు పార్లమెంట్ నియోజవర్గాల నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వీరిలో కొందరు నేతలు ఇప్పటికే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, మరికొందరు మొదటిసారి అవకాశం వచ్చి గెలుపొందాలనే ఆశతో ఉన్నారు. వీరందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో నిలవడం విశేషం.
* హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా.. : తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో జన్మించిన మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన 2009లో నరసరావుపేట ఎంపీగా, 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈయనకు మంచి పట్టు ఉండటం, సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండటం ఈయనకు కలిసొచ్చే అంశం. దీంతో 2019 ఎన్నికల్లోను మోదుగుల గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* కార్యకర్త నుంచి ఎంపీ అభ్యర్థిగా..: తుళ్లూరు మండలం ఉద్దండ్రాయనిపాలెం గ్రామంలో జన్మించిన నందిగం సురేష్ వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వై.ఎస్.జగన్ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సామాన్య కార్యకర్తగా ఉన్న సురేష్‌కు మొట్టమొదటిసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటంతో ఈయన ఎంపీగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
* త్రిముఖ పోటీలో సుచరిత..: తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రంలో జన్మించిన మేకతోటి సుచరిత 2006లో జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం 2009, 2012లో వరుసగా రెండుసార్లు ప్రత్తిపాడులో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
* ఎంబీబీఎస్ చదివిన ఎమ్మెల్యే అభ్యర్థి..: తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి తాడికొండ మండల కేంద్రంలో జన్మించారు. ఈమె ఎంబీబీఎస్ చదివి వైద్యురాలిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాజధాని కేంద్రమైన తాడికొండ నియోజకవర్గంలో టీడీపీలో కుంపటి రేగడంతో పాటు రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఫల్యం చెందిన నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి గెలుపు ఖాయంగా చెప్పవచ్చు.
* బాబు తనయుడితో పోటీ..: మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్వస్థలం ఫిరంగిపురం మండలం మేరిగపూడి గ్రామం. ఈయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున మంగళగిరిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజధాని రైతుల కోసం, ప్రభుత్వ అవినీతిపై పలు పోరాటాలు చేయడంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇక్కడి నుంచి బాబు తనయుడు నారాలోకేష్ పోటీలో ఉన్నప్పటికీ ఆర్కే విజయం తథ్యమని నియోజకవర్గ ప్రజలు గట్టిగా చెబుతున్నారు.
* శుభగృహ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి.. : తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో జన్మించిన నంబూరు శంకరరావు శుభగృహ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం పెదకూరపాడు నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
* ప్రజల ఆదరణతో గెలిచే అవకాశం.. : తాడికొండ నియోజకవర్గం కేంద్రమైన తాడికొండలో జన్మించిన õమొహమ్మద్ ముస్తఫా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుంటూరు తూర్పు నుంచి పోటీలో ఉన్నారు. ముస్తఫా గతంలో తాడికొండ సర్పంచ్‌గా విజయంసాధించి రాజకీయ అరంగ్రేటం చేసి, 2014లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
* తాడికొండ మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికల బరిలో… : గతంలో తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రస్తుత తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సైతం వేర్వేరు నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తానికి తాడికొండలో జన్మించిన, రాజకీయంగా ఎదిగిన ఎనిమిది మంది ప్రస్తుత ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తి కలిగించే విషయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి ఇంతమంది పోటీలో ఉన్న సందర్భాలు లేవని చెబుతున్నారు.