పిఠాపురం సూరిబాబు టీ….
తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సుబ్బయ్య హోటల్, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట పోట్టిక్కలు ఎంత ప్రసిద్ధో …. పిఠాపురంలో సూరిబాబు టీ అంత ఫేమస్. అదో బ్రాండ్.
పిఠాపురం కోటగుమ్మం సెంటర్ కు వెళ్లి సూరిబాబు టీ త్రాగాలని ఆరాటపడే వాళ్ళు ఎందరో.. ఈ జాబితాలో సినీ దర్శకులు, నటులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, ప్రముఖ వ్యాపారులు ఎందరో సూరిబాబు టీ కోసం పాక దగ్గర పడిగాపులు పడాల్సిందే. స్ట్రాంగ్ టీకి పెట్టింది పేరు.
నలబై ఏళ్ళ క్రితం పది నయాపైసలకు టీ అమ్మకం మొదలు పెట్టిన సూరిబాబు చాయ్ ధర ఇప్పుడు ఏడు రూపాయలకు పెరిగింది. కాని డిమాండ్ మాత్రం తగ్గలేదు. దశాబ్దాలుగా ఇక్కడ టీ త్రాగుతున్న వాళ్ళను పిలిచి సూరిబాబు టీలో స్పెషాలిటి ఏమిటని అడిగితే… ” ఏమో నబ్బాయి… అలా అలవాటు అయిపొయింది.. త్రాగకపోతే ఉండలేను” అని చెబుతారు. యాబై ఐదు సంవత్సరాల వియ్యపు సూరిబాబు జీవితంలో మూడొంతులు టీబల్ల వద్దనే తెల్లారిపోయింది. గంటలు తడబడి టీ పొయ్యి ముందు నిలబడి… ఆలస్యమవుతుందని కస్టమర్లు విసుక్కున్నా ఓపిగా సమాదానం చెప్పి….టీ ఇచ్చి వాళ్ళను మెప్పించి పంపిస్తారు.
నాటి నుండి నేటి వరకు వాడే టీ పొడి బ్రాండ్ ఒక్కటే …. డికాషన్ కాసేది బొగ్గుల పొయ్యి పైనే. . పాలు వేడి చేసేది కిరోసిన్ పొయ్యి మీద… కాసేది ఇత్తడి మగ్ లో.. ఇవి కూడా మారలేదు. టీ వడపోసేది గుడ్డ సంచిలో. పాలు కుడా చిక్కటివే వాడతాడు. పాల వాళ్ళను మార్చరు.
ఇదే పొయ్యిపై సూరిబాబు కొడుకులు గాని … సోదరులు గాని టీ కాస్తుంటారు కానీ సూరిబాబు రుచిరాదు. సూరిబాబు పొయ్యివద్ద లేకపోతే టీ తాగకుండా వెనక్కి వెళ్లిపోయేవాళ్ళు ఎందరో.. ‘సూరిబాబు చేతిలోనే టేస్ట్ మహత్యం” వుందని అందరూ అంటూ వుంటారు.
కాఫీ, బోర్న్విటాలకు కూడా అంతే డిమాండ్. కాఫీ పది రూపాయలు, బోర్న్‌విటా పదిహేను రూపాయలు
ఏమైనా కానీ సూరిబాబు చేతుల్లోంచి రావాల్సిందే. క్వాలిటి సూరిబాబు పెట్టుబడి. ఓర్పు, మాట తీరు, శుచి, శుభ్రత అతని వ్యాపార విధానం. ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న వాళ్ళనైనా,
కొత్త వారినైనా తనకు దేవుళ్ళు లానే సూరిబాబు భావిస్తాడు. ఇవే అతని విజయ రహస్యాలు.
నోరు మంచిదైతేనే కాదు, చెయ్యి మంచిదైతే కూడా ఊరు మంచిదవుతుందనడానికి సూరిబాబే ఉదాహరణ.