మరో ఆర్థిక నేరగాడు అరెస్టు…(హితేశ్‌ పటేల్‌)

మరో ఆర్థిక నేరగాడు అరెస్టు

అలబానియాలో పోలీసులు అరెస్టు చేశారు

అలబానియా: భారత్‌లో వేల కోట్ల రూపాయాల ఆర్థిక మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు ఒక్కొక్కరిగా పోలీసులకు చిక్కుతున్నారు. ఆ మధ్య విజయ్‌ మాల్యా.. మొన్న నీరవ్‌ మోదీ.. తాజాగా మరో ఆర్థిక నేరగాడు అరెస్టయ్యాడు. రూ. 8వేల కోట్ల మనీలాండరింగ్‌ కేసులో స్టెర్లింగ్‌ బయోటిక్‌ ప్రమోటర్ హితేశ్‌ పటేల్‌ను అలబానియాలో పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే అతడిని భారత్‌కు అప్పగించనున్నారు.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌ పలు బ్యాంకులకు రూ. 8,100 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సంస్థ నిర్వాహకులైన నితిన్, చేతన్‌, దీప్తి, హితేశ్‌ పటేల్‌ తప్పుడు పత్రాలు చూపించి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు పొంది, ఆ డబ్బును విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు వారిపై అభియోగాలు నమోదు చేశారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు అప్పటికే దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించేందుకు ఈడీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా.. వీరిపై ఈ నెల 11న రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. దీంతో నిందితుల్లో ఒకరైన హితేశ్‌ పటేల్‌ను ఈ నెల20న అలబానియా పోలీసులు అరెస్టు చేశారు…

About The Author