ఓట్లుకొసం డబ్బులిస్తామంటూ.. ఇళ్లలోకి చొరబడి దోపిడీలు…
దొంగలు తెలివిమీరిపోయారు. ఎన్నికల సమయంలో దొంగలు ఓట్లకు డబ్బులిచ్చే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్లమని చెప్పి ఇళ్లలోకి పోయి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి విచిత్రమైన సంఘటనే ఒంగోలులో జరిగింది. అర్థరాత్రి ఓట్లకు డబ్బులిస్తామంటూ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు చూపించాలని అడిగి ఇంటి తలుపులు తీయించి లోపలికి పోయి ఇంటి యజమానిని గాయపరిచి మెడలో గొలుసు లాక్కెళ్లారు. ఒంగోలు లాయర్ పేటలోని వీఐపీ రోడ్డులో నివసించే కూరపాటి పద్మ ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఇద్దరు అపరిచిత యువకులు వచ్చారు. తాము ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తరఫున డబ్బులు పంచుతున్నామని ఆశ చూపారు. ఇందుకోసం ఆధార్‌కార్డు, ఓటరుకార్డు చూపించాలని కోరారు. పోలీసులు వస్తారని త్వరగా తేవాలని హడావుడి చేశారు. పద్మ కార్డు తెచ్చి చూపిస్తున్న సమయంలో ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. ఘటనపై బాధితురాలి కుమారుడు ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.