బి.హెచ్.ఇ.ఎల్ ను సందర్శించిన ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టులు…
హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టుల బృందం శనివారం లింగంపల్లిలోని బి.హెచ్.ఇ.ఎల్ ను సందర్శించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉదయ్ కుమార్ బి.హెచ్.ఇ.ఎల్ లో తయారవుతున్న యంత్ర పరికరాలు, వినియోగిస్తున్న సాంకేతిక విధానం, బి.హెచ్.ఇ.ఎల్ విశేషాలను వివరించారు. అనంతరం బి.హెచ్.ఇ.ఎల్ లోని వివిధ ప్లాంట్లను జర్నలిస్టుల బృందం సందర్శించింది. అందులో తయారవుతున్న వివిధ యంత్రాల విడి భాగాల తయారీని పరిశీలించింది. అంతకు ముందు ఈ బృందం బాలానగర్ లోని నేషనల్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (NIPER) ను సందర్శించింది. ఇన్ స్టిస్ట్యూట్ లోని వివిధ కోర్సుల వివరాలను, పరిశోధనా విధానాలను, మందుల తయారీని సంబంధిత అధికారులు బృందానికి వివరించారు. అలాగే శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీని కూడా బృందం సందర్శించింది. జినోమ్ వ్యాలీ లోని విశేషాలను, ఫార్మా కంపెనీల వివరాలను సంబంధిత అధికారులు బృందానికి వివరించారు.
ఈ బృందం తో పాటు విదేశీ వ్యవహారాల శాఖ, ఎక్స్ టర్నల్ పబ్లిసిటీ డివిజన్ అండర్ సెక్రటరీ శ్రీ ఫకృద్దీన్ అలీ అహ్మద్, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటి డైరెక్టర్ శ్రీ డి.శ్రీనివాస్, ఆసిస్టెంట్ డైరెక్టర్ లు శ్రీ రాజా రెడ్డి, శ్రీ బిమల్ దేవ్ తదితరులు ఉన్నారు.