ఆహారంలో ఎలుకను వేసి గొడవపెట్టుకున్నాడు! రూ.5 కోట్లు డిమాండ్‌ చేశాడు…


రెస్టారెంట్‌లో ఆహారం తిని, బిల్లును ఎగ్గొట్టడానికి అందులో ఓ వ్యక్తి ఎలుకను వేసిన ఘటన చైనాలో వెలుగులోకొచ్చింది. రెస్టారెంటు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. తానే ఆ ఎలుకను ఆహారంలో వేశానని, తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు కూడా డిమాండ్‌ చేశానని అతడు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… గుయో అనే వ్యక్తి తన భార్యతో కలిసి బీజింగ్‌లోని హైదిలాయో రెస్టారెంటుకు వెళ్లాడు. వెళ్లే సమయంలో చచ్చిన ఎలుకను ఓ సీసాలో వేసుకెళ్లాడు. తన భార్యతో కలిసి కడుపు నిండా ఆహారం తిన్నాక.. మెల్లిగా ఆ ఎలుకను తీసి మిగిలిన ఆహారంలో వేశాడు. అనంతరం ‘వినియోగదారులకు ఇటువంటి ఆహారమేనా అందించేది’ అంటూ రెస్టారెంట్ సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు.
దీంతో భయపడిపోయిన రెస్టారెంటు సిబ్బంది.. మరోసారి వచ్చిన సమయంలో అతడికి ఉచితంగా ఆహారం అందిస్తామని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని బతిమాడారు. అయితే, వారు ఇచ్చిన ఈ ఆఫర్‌ తనకు వద్దని చెప్పాడు. దీంతో 20,000 యువాన్లు (దాదాపు రూ.2 లక్షలు) ఇస్తామని రెస్టారెంట్ సిబ్బంది చెప్పారు. అయితే, తనకు 5 మిలియన్ల యువాన్లు (రూ.5 కోట్లు) కావాలని అతడు డిమాండ్‌ చేశాడు. దీంతో చివరకు ఆ రెస్టారెంటు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు విచారణ ప్రారంభించి, చివరకు గుయోనే ఆ ఆహారంలో ఉద్దేశపూర్వకంగా ఎలుకను వేశాడని తేల్చారు. న్యాయస్థానంలో తన తప్పుని ఒప్పుకున్న అతడు.. తాను ఆ ఎలుకను హెనాన్‌ నుంచి ఓ సీసాలో బీజింగ్‌కు తీసుకొచ్చానని చెప్పాడు. తాను ఉచితంగా భోజనం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని, అయితే, చివరకు దురాశకు పోయి డబ్బు కూడా డిమాండ్‌ చేశానని చెప్పాడు.

About The Author