అగ్నిప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు…టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్…
తిరుమల అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా శేషాచల అడవులు, రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంటలు వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఉన్న ఫైర్ లైన్స్ నెట్ వర్క్‌ను విస్తరించాలన్నారు. తిరుమలలో మూడో దశ రింగ్ రోడ్‌లో ఏప్రిల్ 15 నుండి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన నీటిని సరఫరా చేయాలని అటవీశాఖ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రింగ్‌రోడ్ వెంబడి సంవత్సరం పొడవునా పచ్చదనంతో కూడిన మొక్కలను నాటాలని, వీటికి అవసరమైన ఎరువులను తిరుమలలోని సాలిడ్ వేస్టు ప్లాంట్ నుండి సరఫరా చేయాలన్నారు. తిరుమలలో భక్తులకు అవసరమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని తెలిపే ఫ్లెక్సీలను శ్రీమాతృ శ్రీ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కళ్యాణకట్ట, కల్యాణవేదిక, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సిఆర్వో తదితర ప్రాంతాలలో ఒకే సైజ్‌లో విరివిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సైన్ బోర్డులను భక్తులు సులభంగా గుర్తించేలా అవసరమైన ఎత్తులో ఏర్పాటు చేయాలన్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి భవనం సమీపంలో వసతికి సంబంధించిన బోర్డులను మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుకోవాలని, బోర్డులలో అక్షరాలు బాగా కనిపించేలా పొందుపరచాలని సూచించారు. ప్రస్తుతం భక్తుల రద్దీ తక్కువ ఉన్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. తిరుమలలో వ్యర్థనీటిని శుద్ధి చేసి పూర్తి స్థాయిలో తిరిగి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలోని ఎలిఫెంట్ గేట్ వద్ద మహాద్వారం వరకు జరుగుతున్న క్యూలైన్ల పనులను ఏప్రిల్ 15వ తేది లోపు పూర్తి చేయాలని కోరారు.
టిటిడి అనుబంధ ఆలయాలైన కురుక్షేత్రలోని శ్రీవారి ఆలయం, హైదరాబాద్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం తదితర ఆలయాలలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, డిఎల్‌వో శ్రీ రమణనాయుడు, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.