మొట్టమొదటి OLA టాక్సీ లేడీ డ్రైవర్…
కత్తి పెట్టుకుని కారు నడుపుతున్నా…
పొసగని వివాహ బంధంలో సమాజం కోసం బతకాలా….
లేదా బయటపడాలా…..
అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు…
ఎందుకు కొనసాగాలి..! అనుకుంది #హిమబిందు.
ఆ బంధం నుంచి బయట పడింది.కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చింది. అయినా భయపడలేదు. తన జీవితం, తనకు నచ్చినట్టు ఉండాలనే కోరుకుంది. అందుకే ఇంజినీరింగ్ చదివినా, ఓ పాఠశాలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసినా… క్యాబ్‌డ్రైవర్‌గా విధులు నిర్వహించడానికి వెనకాడలేదు. హైదరాబాద్‌లో మొదటి మహిళా ఓలా డ్రైవర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. #ప్రత్యేకావసరాలున్న చిన్నారులకోసం ఓ ట్రస్టు ప్రారంభించి నిస్వార్థ సేవతో అడుగులు వేస్తోన్న ఆమె జీవితం ఎందరో మహిళలకు పాఠం.
ఈజీవితం మనది.. ఎలా జీవించాలో నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా మనకే ఉంటుంది. ఆడైనా.. మగైనా సరే.. ఎవరు కోరుకున్న జీవితం వారే జీవించాలని నమ్మే సిద్ధాంతం నాది. అందుకే ఏ సంతోషం లేని వైవాహిక జీవితాన్ని వదులుకున్నాను. నన్ను నేను నమ్ముకున్నాను. ఒకప్పుడు ఓ పాఠశాలకు కార్యనిర్వహణాధికారిగా పనిచేసినా.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయడానికి సిగ్గుపడలేదు. మహిళలు రాని #అరుదైన_రంగంలోకి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నానని గర్వంగా ఉంది. నాలుగు నెలల క్రితం ఓలా క్యాబ్ డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టుకున్నా. నన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మరికొందరు అమ్మాయిలు ఆరాధనగా చూశారు. బాగా చదువుకున్న ఈమె ఈ వృత్తిలో ఏంటని చిన్నచూపూ చూసినవారూ ఉన్నారు. నిజానికి ఆ రోజు నేనున్న పరిస్థితి వేరు. ఇంటి నుంచి బయటికొచ్చేశా. చేతిలో డబ్బుల్లేవు. కష్టపడి చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికెట్లు లేవు. కనుచూపు మేరలో నా అనేవాళ్లు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో మొదటి మహిళా ఓలా క్యాబ్ డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.
‘ఆడపిల్లలు పెళ్లయ్యాక భర్తతోనే ఉండాలి. గొడవలు వచ్చినా సర్దుకోవాలి. సంఘజీవులం కాబట్టి సమాజం గురించి కూడా ఆలోచించాలి’ అనేవారు. మధ్యతరగతి తల్లిదండ్రులుగా వాళ్లు అలా ఆలోచించడంలో తప్పు లేదు. కానీ విద్యావంతురాలిగా దీర్ఘకాలం రాజీపడి బతకడం నాకు సరి కాదనిపించింది. ప్రేమ లేని బంధంలో ఉండే బదులు దాన్నుంచి బయట పడటమే మంచిదనే ఆలోచనతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నా.
#ధైర్యం_చేశా: అమ్మానాన్నలకి అది నచ్చలేదు. దాంతో నా స్కూల్ బాధ్యతలూ, ఆర్థిక లావాదేవీలు, నగలూ వాళ్ల సొంతం చేసుకున్నారు. నా బాబునీ వాళ్ల వద్దే ఉంచుకున్నారు. ఇవన్నీ దూరం చేస్తే అయినా వాళ్ల మాట వింటా అనుకున్నారు. అంతే తప్ప.. నేనంటే ప్రేమ లేక కాదు. నేను మాత్రం వాటికోసం బతకట్లేదు అని నిరూపించాలని ఇంటి నుంచి బయటకొచ్చేశా. ఆ సమయంలో తొమ్మిదేళ్ల మా అబ్బాయికి అర్థం కాకపోయినా నా ఆలోచనలు చెప్పి అడుగు బయటపెట్టా. అప్పుడు నా దగ్గర బ్యాంకులో పదివేల రూపాయలు, కారు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో చేరా. మరి బతకాలంటే ఉద్యోగం ఉండాలిగా. నా దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. కేవలం మెయిల్‌లోనే జిరాక్స్‌లు ఉన్నాయి. వాటితో ఓ పాఠశాల్లో దరఖాస్తు చేసుకుని టీచర్ ఉద్యోగం పొందా.
#బ్యాంకు_రుణంతో: ఆ ఉద్యోగంతో వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాకాకుండా ఏదైనా చేయాలని ఆలోచించా. నా దగ్గర కారుంది. నాకు డ్రైవింగ్ తెలుసు. నిజానికి షీక్యాబ్స్ కాకుండా కమర్షియల్ సర్వీసులో ఆడవాళ్లు ఎవరు లేరు. అయినా నేనెందుకు ధైర్యం చేయకూడదు అనిపించింది. దాంతో నా దగ్గర ఉన్న కారుని అమ్మేశా. డీజిల్ కారుకొందామంటే మరికొంత డబ్బు అవసరమైంది. దాంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేశా. అక్కడ ఎప్పట్నుంచో నాకు వ్యక్తిగత ఖాతా ఉంది. పైగా ఓలా వాళ్లు కూడా రికమండ్ చేయడంతో హామీ లేకపోయినా రుణం వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో డీజిల్ కారు కొని ఓలా డ్రైవర్‌గా దరఖాస్తు చేసుకున్నా. అలా ఈ ఏడాది జనవరి నుంచి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఆర్థికంగా నిలదొక్కుకున్నా. అంతా బాగానే ఉన్నా.. నా బాబుకి దూరమయ్యాననే బాధ ఒక్కటే నాకుంది. కానీ ఇప్పుడు నా జీవితాన్ని నేను తిరిగి గాడిన పెట్టుకున్నా. ఇందులో నూ నాకు సంతృప్తి లభించలేదు. అందుకే ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం ఓ ట్రస్టు స్థాపించాను. నాలాంటి ఆలోచనలు ఉన్న మరో నలుగురు స్నేహితురాళ్లు నాకు తోడయ్యారు. ప్రస్తుతం పదిమంది చిన్నారులకు రకరకాల అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఉద్యోగాలు చేయాలనే లక్ష్యంలో ఇప్పటినుంచీ ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నా.
#కత్తి_పెట్టుకున్నా: ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ క్యాబ్ నడుపుతాను. ఆ తరవాత కొన్ని గంటలు చిన్నారులకు శిక్షణ ఇచ్చి మళ్లీ అర్ధరాత్రి వరకూ డ్రైవింగ్ చేస్తా. నా కారులో ఎక్కిన ప్రయాణికులు ఆశ్చర్యంగా చూసి ఎందుకు ఇటు వైపు వచ్చారంటూ ఆసక్తిగా అడుగుతుంటారు. చాలా వరకూ సానుకూలంగా ఉంటారు. రాత్రి సమయంలో ఆడవాళ్లు ఎక్కితే సౌకర్యంగా భావిస్తారు. మరికొందరు మగవాళ్లు ముందు సీట్లో కూర్చుంటారు. నిర్మానుష్యంగా ఉన్న వైపు దారి చూపిస్తుంటారు. అయినా ఆ సమయంలో భయం కనిపించకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. నన్ను నేను చూసుకుంటూ.. ట్రస్టును నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇకపైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయను. నా వద్ద ఎప్పుడూ ఒక కత్తి ఉంచుకుంటాను. ఇప్పటి వరకూ దాని అవసరం రాలేదనుకోండి.