ఖమ్మం లోక్ సభ నియోజక వర్గ బహిరంగసభకు సీఎం శ్రీ కేసీఆర్…

ఖమ్మం లోక్ సభ నియోజక వర్గ బహిరంగసభకు సీఎం శ్రీ కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీతారామ ప్రాజెక్టుతో రెండు పంటలకు నీరు అందుతుందని, బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవన్నారు.

66 ఏళ్లు పాలించిన పార్టీలే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. జాతిని చైతన్యవంతం చేయడంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషించాలి. 1947 నుంచి కాంగ్రెస్ నేతలు గరీబీ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ కాలం నుంచి పేదరికాన్ని పారదోలుతామని చెబుతున్నారు. తరాలు మారినా కాంగ్రెస్ నేతల గరీబీ హఠావో నినాదం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు క్రియారహిత పాలన చేశాయి. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ నేతలు కీలక పదవులు పొందుతారు. టీఆర్‌ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులు వస్తాయి.

ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా కష్టాలు తీరతాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుంది. సొంత ఇంటిస్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇంటి కోసం నిధులు ఇస్తాం. ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. సుబాబుల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభకు పార్టీ లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుతో పాటు, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కేశవరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

About The Author