భాగవతము -2 వ భాగం:
అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది.
అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.
వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.
మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.
పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు…ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు . . .✍