తిని తాగినా , తాగి తిన్నా .. రెండూ ఒకటే…


మద్యంపై ఎన్నో అపోహలున్నాయి. . మద్యం కొద్దిగా తాగితే ఏమీ కాదనుకోవటం.. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఎలాంటి హానీ ఉండదనుకోవటం పూర్తిగా అపోహ. భోజనం చేయటం వల్ల తాత్కాలికంగా జీర్ణాశయంలో మంట, చికాకు వంటి ఇబ్బందులు కనబడకపోవచ్చేమో గానీ తిని తాగినా, తాగి తిన్నా మద్యం మూలంగా తలెత్తే అనర్థాలను తప్పించుకోలేం. మద్యం ఎంత తీసుకుంటారనేదాన్ని బట్టి దాని దుష్ప్రభావాలు, అనర్థాల తీవ్రత పెరుగుతుంది. అందువల్ల వీలైనంతవరకు మద్యానికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఒకవేళ మరీ తప్పదనుకుంటే మితం పాటించటం మంచిది. మన కాలేయం కొంతవరకే ఆల్కహాల్‌ను విడగొట్టగలదు. నిర్ణీత మద్యం మోతాదు (ఒక పెగ్గు) కొలమానం ఒకో దేశంలో ఒకోలా ఉంటుంది. మనదేశంలో సుమారు 60 మిల్లీలీటర్లను ఒక పెగ్గుగా భావిస్తుంటారు. కానీ వైద్యపరంగా ఒక పెగ్గు అంటే 25 మిల్లీలీటర్లే. మంచి ఆరోగ్యంతో ఉన్నా కూడా మన కాలేయం వారంలో గరిష్ఠంగా ఇలాంటి 21 పెగ్గుల కన్నా ఎక్కువ.. అంటే 525 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ (మహిళల్లోనైతే 350 ఎం.ఎల్‌.) మద్యాన్ని విడగొట్టలేదు. దీన్ని విడగొట్టే క్రమంలో రకరకాల విషతుల్యాలు పుట్టుకొస్తాయి కూడా. ఇవి కాలేయాన్ని బాగా దెబ్బతీస్తాయి. కాలేయానికి కొవ్వు పట్టటం, కాలేయవాపు (హెపటైటిస్‌) వంటి సమస్యలు మొదలవుతాయి. క్రమంగా కాలేయం గట్టిపడిపోయి తాళ్లుతాళ్లుగా (సిరోసిస్‌) అయిపోతుంది. కాలేయ క్యాన్సర్‌ కూడా రావొచ్చు.

About The Author