మత్స్య జయంతి…


శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణ కోసం ధరించిన దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం. సృష్టి పరిణామ క్రమంలో మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సంకేతంగా చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు ‘మత్స్యజయంతి’ జరుపుకొంటారు. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి నాలుగు వేదాలూ ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కున్నాడు. దాంతో బ్రహ్మ సృష్టికార్యానికి ఆటంకం ఏర్పడింది. బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకున్నాడు. స్వామి మత్స్యరూపం ధరించి సముద్రంలోకి చొచ్చుకుపోయి సోమకాసురుణ్ని సంహరించి, తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకు అందజేశాడు. ఇది సంక్షిప్తంగా మత్స్యావతార గాథ.
వరాహ కల్ప గాథ వేరొకటి మనకు పురాణాల్లో కనిపిస్తుంది. వైవస్వత మనువు ‘కృతమాలిక’ నదీ తీరంలో పితృదేవతలకు జలతర్పణం చేస్తుండగా ఒక చేపపిల్ల అతడి దోసిట్లో పడింది. అతడు కరుణించి, ఆ చేపపిల్లను తన కమండలంలో వేశాడు. మర్నాటికి ఆ చేపపిల్ల పెద్దదై తనకు ఈ కమండలం సరిపోలేదంది. మనువు దాన్ని తీసి ఒక చెరువులో విడిచాడు. ఆ చెరువు దానికి సరిపోలేదు. చేప రోజురోజుకూ పెద్దదైపోతుంటే రాజు దాన్ని సముద్రంలో విడిచాడు. మత్స్యం అంతలో రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగిపోయింది. మనువు సంభ్రమాశ్చర్యాలకు లోనై ‘స్వామీ, నీవెవరు?’ అని అడిగాడు. అప్పుడు ఆ మీనం తన వైనం చెబుతుంది. ‘రాజా! నేను శ్రీమన్నారాయణుడిని. ఏడు రోజుల్లో ప్రళయం రానున్నది. సకల జీవకోటి నశిస్తుంది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తున్నది. కాబట్టి వేదాలు, విద్యలు, బీజాలు, నేను, బ్రహ్మ… నీ రక్షణ పొందవలసి ఉంది. ఇక్కడ సప్త రుషులతో కూడిన ఓ నావ ఉంటుంది. నీటి మీద తేలుతూ అనంతుడనే సర్పం ఇక్కడికి చేరుతుంది. దాన్ని తాడు చేసి ఆ నావను నా కొమ్ముకు కట్టివెయ్యి!’
సత్యవ్రతుడైన మనువు విష్ణువు చెప్పినట్లే చేశాడు. అంతా సురక్షితులయ్యారు. అంతర్ధానమైన మత్స్యం అవతారమూర్తిగా ప్రశంసలందుకుంది. ఆ విధంగా వేదాలు శాశ్వతత్వాన్ని సంతరించుకుని మానవ మేధకు జ్ఞాన సుధలందిస్తున్నాయి.
దక్షిణావర్త శంఖవృత్తాంతం కూడా ఈ మత్స్యావతార గాథతో ముడివడిఉంది. మత్స్య రూపుడైన విష్ణువు సోమకాసురుడి కడుపు చీల్చి వేదాలను వెలుపలికి తీస్తున్న తరుణంలో పవిత్రమైన దక్షిణావర్త శంఖం వెలువడింది. స్వామి శంఖాన్ని తాను తీసుకుని, బ్రహ్మకు వేదాలు అప్పగించాడు. తమస్సు నుంచి వేదాలు వెలుగులోకి రావడంతో బ్రహ్మ సృష్టికార్యానికి కలిగిన ప్రతిబంధకం తొలగిపోయింది. బ్రహ్మ సహజ స్వరూపాన్ని పొందడమే వేదాలు మళ్ళీ మత్స్యావతారధారణతో లభ్యం కావడానికి గల తత్వార్థం. పరమాత్మ వల్ల సంప్రాప్తించిన ఆ వేదాలు మానవ కోటి ఆధ్యాత్మిక మహాభ్యుదయానికి వరప్రసాదాలు. మత్స్య జయంతి గురించిన వృత్తాంతం ధర్మ సింధువు, స్మృతికౌస్తుభం, ఆమాదేర్‌ జ్యోతిష గ్రంథాల్లో విపులంగా ఉంది.
క్రైస్తవుల్లో మత్స్యం శాంతి దేవతగా ఆరాధనలందుకుంటోంది. మహమ్మదీయులూ చేపను దైవంగా భావిస్తారు. బౌద్ధ జాతక కథల్లో బుద్ధుడు మీనంగా అవతారమెత్తిన కథా ఉంది. మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని వేదనారాయణస్వామి ఆలయం అని పిలుస్తారు.

About The Author