బల్లిపాటు ఫలితాలు…
సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వెలుతూరుకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లికూడా శకునం పలుకుతుందనీ, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
ఇంట్లో బల్లి చేసే శబ్ధాలు, శరీరంపై పడితే.. జరిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని శాస్త్రం చెబుతోంది.
ఇక ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభ కార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని చెప్పవచ్చు. పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన విషయం తెలిసే అవకాశం ఉంది.
ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే.. బుధగ్రహ ప్రభావంతో బంధువులు రాక ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు.. వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి.
బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా, చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
బల్లి శరీరంపై పడితే..
బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి క్రిందకు దిగితే మంచిది కాదు. క్రింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది.
శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. తల మీద పడితే కలహం, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టు మీద అయితే కష్టం, వెనుక జుట్టు మీద పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. ఇక ముఖంపైన పడితే బంధుదర్శనం, కనుబొమ్మల మీద కలహం. కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం. కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.